నటుడు విజయ్ చిత్రం విడుదలవుతోందంటే దాని ప్రభావం ఆయన అభిమానుల్లోనే కాకుండా చిత్ర పరిశ్రమలోనూ చాలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన గతంలో నటించిన చిత్రం 'తెరి' ( పోలీసోడు) రీ రిలీజ్ కానుంది. దీంతో ఇతర చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నటుడు విజయ్ హీరోగా వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మించిన తెరి సినిమాలో నటి సమంత, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది.
జన నాయగన్ వాయిదా పడటంతో విజయ్ ఫ్యాన్స్ కోసం తెరి చిత్రాన్ని ఈ నెల 23వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. దీంతో పాటు అజిత్ హీరోగా నటించిన మంగాత్తా చిత్రం కూడా అదే తేదీన రీ రిలీజ్ కానుంది. అయితే అదే తేదీన కొత్త చిత్రాలైన ద్రౌపది–2, హాట్‌స్పాట్–2 విడుదల కానున్నాయి. ఈ క్రమంలో విజయ్ నటించిన తెరి చిత్రం రీ రిలీజ్ కానుండడంతో ఈ చిన్న చిత్రాలకు థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో హట్‌స్పాట్–2 చిత్ర దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్ తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేశారు. అందులో తెరి చిత్ర విడుదలను వాయిదా వేయాల్సిందిగా నిర్మాత కలైపులి ఎస్.థానుకు విజ్ఞప్తి చేశారు.

తెరి చిత్రం విడుదల కారణంగా తమ చిత్రానికి థియేటర్ల సమస్య వస్తోందని అందులో పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని ద్రౌపది–2 ,చిత్ర దర్శక, నిర్మాతలు ఎక్స్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. దీంతో చిన్న చిత్రాలను కాపాడేవిధంగా నిర్మాత కలైపులి ఎస్.థాను తెరి చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ద్రౌపది–2 చిత్ర దర్శక నిర్మాతలకు కాస్త రిలీఫ్ వచ్చినట్లు అయ్యింది. వెంటనే ఆ చిత్ర దర్శకుడు మోహన్.జీ, నిర్మాత చోళ చక్రవర్తి నిర్మాత కలైపులి ఎస్.థానును కలిసి ధన్యవాదాలు తెలిపారు.


