
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న హరిహర వీరమల్లు చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. టికెట్ ధరలతో పాటు ఈనెల 23 ప్రత్యేక బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంపునకు ఆమోదం తెలిపింది. ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 600 వరకు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అంతే కాకుండా ఈ నెల 24 నుంచి 27 వరకు ఐదు ఆటలు ప్రదర్శించుకోడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి రోజు నుంచే మల్టీప్లెక్స్‌ల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో రూ.150 టికెట్ ధరలు పెంచుకునేందుకునేలా వెసులుబాటు కల్పించింది. అలాగే జులై 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీఫ్లెక్స్ల్లో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.106 పెంచుకునేలా అనుమతులు జారీ చేసింది. పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత మళ్లీ హరి హార విరమల్లు సినిమాకి ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం గమనార్హం. అయితే గతంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏపీలోనూ భారీగా ధరల పెంపు..
ఏపీలోలోనూ గత ప్రభుత్వంలో బెనిఫిట్ షోలు రద్దు చేయగా.. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' కోసం మళ్లీ వాటిని తీసుకొచ్చారు. 23న అంటే విడుదలకు ముందు రోజు రాత్రి 9 గంటల ప్రీమియర్ షోలకు అనుమతించారు. ఈ షోకి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌ల్లో అయితే ఏకంగా రూ.200 పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల పాటు రేట్ల పెంపు అమల్లో ఉండనుంది.
'హరిహర వీరమల్లు' సినిమా దాదాపు ఐదేళ్లపాటు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ తీశారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్ విలన్. తొలుత క్రిష్ డైరెక్టర్ కాగా.. మధ్యలో ఆయన తప్పుకొన్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. ఆయన మిగతా అంతా పూర్తి చేశారు.