Taraka Ratna : తారకరత్న భౌతికకాయం చూసి కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు

తారకరత్న మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 40 ఏళ్ల వయసులోనే తారకరత్న దూరం కావడం కుటుంబంతో పాటు నందమూరి అభిమానుల్ని కలిచివేస్తోంది. 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.
కాగా అజాత శత్రువుగా, ఎంతో మంచి మనస్తత్వం గల వ్యక్తిగా తారకరత్నకు పేరుంది. దీంతో ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న భౌతికకాయన్ని ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచారు. ఈ క్రమంలో ఆయన్ను అలా చలనం లేకుండా చూసి తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీత దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు.
ఎదిగిన కొడుకు ఇలా తమ కళ్ల ముందే అచేతనంగా ఉండటం చూసి అల్లాడిపోయారు. వాళ్లను సముదాయించడం అక్కడున్న వారి తరం కాలేదు. తారకరత్న తల్లిదండ్రుల మనోవేదన చూసి అక్కడున్న వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.