
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ బోరున ఏడ్చేసింది హీరోయిన్ తనుశ్రీదత్తా. నాలుగైదేళ్లుగా ఈ బాధను భరిస్తున్నా.. 2018లో మీటూ ఉద్యమం అప్పటినుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది అంటూ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన అభిమానులు, నెటిజన్లు.. హీరోయిన్‌కు ఏమైందని కంగారుపడ్డారు. తను క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.
పబ్లిసిటీ స్టంటా?
అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే తనుశ్రీ దత్తా.. తను మామూలుగా ఉన్న వీడియోలు షేర్ చేసింది. ఇది చాలామందికి మింగుడుపడలేదు. అప్పుడే ఏడ్చింది, ఇంతలోనే మళ్లీ నార్మల్‌గా వీడియోలు పెడుతోంది.. తన బాధ నిజమా? లేక పబ్లిసిటీ స్టంటా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి అయితే.. నేను తనుశ్రీ మేడమ్‌కు అభిమానిని. కానీ, ఈసారి తననిలా చూస్తుంటే లైమ్‌లైట్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. బహుశా నా ఆలోచన తప్పు కావచ్చు, కానీ చూడటానికి మాత్రం అలాగే ఉంది. మీ వీడియో చూస్తే అలాంటి అభిప్రాయమే కలుగుతోంది. నా మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి అని రాసుకొచ్చాడు.
నాటకాలు ఆపేయ్
అందుకు తనుశ్రీ స్పందిస్తూ.. అవునా? ఇప్పుడే నీ ప్రొఫైల్ చెక్ చేశా! ఈ రోజే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశావ్.. ఈ కామెంట్ పెట్టడానికేనా? అని కౌంటర్ ఇచ్చింది. పనికిమాలిన వ్యక్తుల కోసం ఎన్నిరోజులు ఏడుస్తూ కూర్చోవాలని ప్రశ్నించింది. మరో వ్యక్తి.. మీ నాటకాలు ఆపండి. మీ డ్రామా చూసీచూసీ విసిగిపోయాం. నిజంగా మీరన్నట్లు ముంబై మీకు సురక్షితం కాకపోతే అమెరికాకు వెళ్లిపోవచ్చుగా.. తెలిసి తెలిసి ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో పెట్టడం? నానా పటేకర్ మంచి మనిషి, బాలీవుడ్‌లో బెస్ట్ యాక్టర్. అతడి పరువు తీయడానికి ప్రయత్నించకండి. ఇకనైనా డ్రామాలు ఆపేయండి, మాకు నిజమేంటో తెలుసు. మీరెంత చేసినా బాలీవుడ్‌లో మీకు సినిమాలు రావు అని కామెంట్ పెట్టాడు.

నానా పటేకర్, తనుశ్రీ దత్తా
హీరో, నటుడు కలిసే..
నెగెటివ్ కామెంట్లతో విసిగిపోయిన తనుశ్రీ దత్తా (Tanushree Dutta).. మీటూ ఉద్యమం తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని బయటపెట్టింది. నానాపటేకర్ ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఎన్జీవోలో జరుగుతున్న కార్యకలాపాలను బయటపెడతానన్న భయంతో చుల్మాన్ భాయ్ (సల్మాన్ ఖాన్)కు రూ.5 కోట్లిచ్చి తనకు బ్రేకులు వేయమని చెప్పాడంది. దాంతో చుల్మాన్ ఇలా కొందరు మనుషులను పెట్టించి.. రాత్రిపూట తన ఇంటి ఎదుట ఏవేవో శబ్ధాలు చేయిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది.
పిచ్చిదాన్ని కాదు
మధ్యలో సల్మాన్ ఎందుకు వచ్చాడో అర్థం కాక తలపట్టుకున్న నెటిజన్లు.. ఆమెను మంచి సైకియాట్రిస్ట్‌ను కలవమని సలహా ఇచ్చారు. అందుకు తనుశ్రీ.. నేనేమీ పిచ్చిదాన్ని కాదు. వాళ్ల బండారం బయటపెట్టినందుకు పిచ్చిదాన్ని చేస్తారా? నాలాగా టార్చర్ ఫేస్ చేస్తున్న అందరూ ఇలాగే ఆడియో, వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టండి. అప్పుడుకానీ వారి ఆటలు సాగవు అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. అంతలోనే తనను వారి నుంచి కాపాడమంటూ అభ్యర్థించింది.
అసలేం జరిగింది?
మీటూ ఉద్యమంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన వేధింపులను బయటపెడుతూ సంచలనాలకు తెరలేపింది హీరోయిన్ తనుశ్రీ దత్తా. నానా పటేకర్ (Nana Patekar) తనను లైంగికంగా వేధించాడంటూ 2018లో మీడియా ముందుకు వచ్చింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా కోసం ఓ పాట షూట్ చేస్తున్న సమయంలో నానా పటేకర్ సహా మరో ముగ్గురు తనను వేధించారని ఆరోపించింది. చట్ట ప్రకారం మూడేళ్ల లోపు ఫిర్యాదు చేస్తేనే విచారణకు అర్హత ఉందని, పదేళ్ల నాటి ఘటనని విచారించడం కుదరదని న్యాయమూర్తి కేసు కొట్టివేశారు. కాగా హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన తనుశ్రీ.. తెలుగులో 'వీరభద్ర' మూవీలో యాక్ట్ చేసింది.
చదవండి: ఛత్రపతి శివాజీ బయోపిక్ లేనట్లే.. ఇండస్ట్రీలో ఇంత దారుణమా?