Top Kollywood Cinema Actors Importance in Tamil Nadu Politics - Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో సినిమా గ్లామర్‌ క్లిక్‌ అవుతుందా?

Published Sun, Jun 18 2023 2:15 PM

Tamil Nadu Political War Vijay Entry He Is Success - Sakshi

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తిగా ఉంటాయి. అక్కడలో సినిమా, రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది.. సినిమా హీరోలు సొంత పార్టీలు స్థాపించి ప్రజల్లోకి వెళ్లి రాజకీయాల్లో అత్యంత క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వరకూ అందరూ సినీరంగం నుంచి వచ్చిన వారే.. ఎంజీఆర్ మొదలు విజయ్ కాంత్, కమల్ హాసన్ వరకూ సొంత పార్టీలు స్థాపించిన వారే.. దక్షిణ భారత్‌లో ఏపీ రాజకీయల తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ రాజకీయాలు తమిళనాడువి మాత్రమే.. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల ఆధిపత్యం ఉంటుంది.. డీఎంకే లేదా ఏఐడీఎంకే ఈ రెండు పార్టీలే తమిళ రాజకీయాలను శాసిస్తాయి.. అప్పట్లో కరుణానిధి, జయలలిత మధ్య రాజకీయ యుద్ధం జరుగుతూనే ఉండేది.

చరిత్ర సృష్టించిన సినీ నటుల రాజకీయ ప్రస్థానం 
తమిళనాడు రాజకీయాలలో సినీరంగ ప్రముఖుల ప్రవేశం మొదట  కరుణానిధితో మొదలైంది.  ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీకి ఆ పార్టీ పత్రికకి ఆయన మరణించే వరకు అధ్యక్షుడిగా, పత్రిక  సంపాదకుడిగా ఉన్నారు. ఇక ఎంజీ రామచంద్రన్ 1972 అక్టోబర్ 17న ఆల్ ఇండియా అన్నాడీఎంకే (ఏఐఎడిఎంకె) పార్టీని స్థాపించారు. మొదట 11 మంది ఎమ్మెల్యేలతో మొదలైన ఆయన ప్రస్థానం 1977లో ప్రభుత్వాన్ని ఏర్పరిచి పదేళ్ల సుదీర్ఘ కాలం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక జయలలిత విషయానికి వస్తే ఎం.జి.రామచంద్రన్ మరణానంతరం ఆయన వారసురాలిగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు.

1991 తమిళనాడు ఎన్నికల్లతో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 225 గెలిచి మొదటిసారి ముఖ్యమంత్రిగా రాజకీయాలలో తన సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత 2001లో రెండవసారి 2011లో మూడవసారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మరణానంతరం వెనువెంటనే మరో రాజకీయ దిగ్గజం కరుణానిధి కూడా మరణించడంతో తమిళనాడులో ఒక్కసారిగా రాజకీయ శూన్యత ఏర్పడింది.  సరిగ్గా అలాంటి సమయంలోనే కమలహాసన్ 'మక్కల్ నీది మయ్యం' (ప్రజా న్యాయ కేంద్రం) అనే పార్టీని స్థాపించారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ తన కొత్త పార్టీ ప్రారంభం అవుతుందని అదే సమయంలోనే ప్రకటించారు.

1970లో విప్లవాత్మక మార్పు..
1970 చివర్లో తమిళ సినీ రంగంలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి. ఎంజీఆర్-శివాజీ గణేషన్‌ల శకం ముగిసింది. అప్పుడే రజనీ-కమల్ ద్వయం హవా మొదలైంది. వీరిద్దరూ 1970 చివరి నుంచి 1990ల చివరి వరకు తమిళ సినిమా పరిశ్రమను దున్నేశారనే చెప్పాలి. తమిళంలో హిట్ సినిమా అంటే.. అయితే రజనీ లేదా కమల్‌ పేరు దానిలో కచ్చితంగా ఉండేది.

ఎంజీఆర్-శివాజీల స్థానాన్ని రజనీ-కమల్ భర్తీ చేసినప్పుడు ప్రజలు ఎర్రతివాచీ పరిచారు. రజనీని ఎంజీఆర్‌తో, కమల్‌ను శివాజీతో అభిమానులు పోల్చారు. కానీ ఈ పోలికలన్నీ సినిమాల వరకే. ఇప్పుడు రాజకీయాల విషయానికి వస్తే.. రజనీ ఎంజీఆర్‌లా మారలేకపోయారని ఎప్పుడో తేలిపోయింది.. ఇక మిగిలింది కమల్‌ హాసన్‌, శివాజీ అవుతారో? లేదో తేలాల్సి ఉంది.


రాజకీయాల నుంచి రజనీ ఎందుకు తప్పుకున్నారు?
రజనీకాంత్ పార్టీ రద్దు చేయడానికి ప్రధాన కారణం.. ఆయన ఆరోగ్యమేనని తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన గడువు దాటిపోయిందని ఆయన భావిస్తున్నట్లు సంబంధికులు తెలిపారు. రాజకీయాల్లో ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుందని, ఇందుకు తన ఆరోగ్యం సహకరించకపోవచ్చని రజినీకాంత్ అభిప్రాయపడ్డారు. దీంతో రజినీ మక్కల్ మండ్రం పార్టీని రద్దు చేసుకున్నట్లే అయింది.


కమల్‌ హాసన్‌ ఎటువైపు?
మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమల్‌ పార్టీకి వచ్చిన ఓట్లు 3.6 శాతం మాత్రమే. దాంతో రాజకీయ నాయకుడిగా కమల్‌ కొంత గందరగోళంలో పడ్డారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ద్రావిడ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండకపోతే తమిళనాడులో రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని తేల్చిచెప్తున్నారు. అదే సమయంలో సినిమాలు, రాజకీయాల మధ్య బ్యాలెన్స్‌ చేసుకోవడం అంత తేలికైన విషయం కాదని కూడా హెచ్చరిస్తున్నారు.

పాలిటిక్స్‌ను పార్ట్‌ టైమ్‌ హాబీగా తీసుకుంటే తమిళ ఓటర్లు ఆదరించరని అంటున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూ.. సీరియస్‌ పొలిటిషియన్‌ అని చెప్తే నమ్మేందుకు ప్రస్తుత ఓటర్లు సిద్ధంగా లేరని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా కమల్‌ హాసన్‌ ముందున్నవి రెండే ఆప్షన్లు తమిళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకటి పార్టీకి ప్యాకప్‌ చెప్పడం, రెండు పొత్తు కుదుర్చుకొని పార్లమెంట్‌ సభ్యుడిగా అడుగుపెట్టడం. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే పొత్తుకు సిద్ధమనే సంకేతాలు కమల్‌ నుంచి కనిపిస్తున్నాయి. ఈ మధ్య జరిగిన ఈరోడ్‌ ఉపఎన్నికలో డీఎంకే అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.

అంతే కాదు విక్రమ్‌ సినిమా విజయోత్సవాల్లో డీఎంకే అధినేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. అన్నట్టు తమిళనాడులో విక్రమ్‌ సినిమా హక్కులను ఉదయనిధి స్టాలిన్‌ కొనుగోలు చేశారు. మరి ఈ పరిణామాలు కమల్‌కు ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో డీఎంకే వైపు టర్న్‌ తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది.

దళపతి విజయ్‌ రానిస్తాడా? 
సినీ నటుడు విజయ్‌ రాజకీయ ప్రవేశ చర్చ తరచూ తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల కాలంలో తన చిత్రాల్లో రాజకీయంగా చర్చకు తావిచ్చే డైలాగులతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇది వివాదాలకు సైతం దారి తీస్తున్నాయి. అలాగే విజయ్‌ ఇటీవల కాలంగా వేస్తున్న అడుగులు 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పయనం సాగిస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. అభిమానులతో జిల్లాల వారీగా సమీక్షలు, సమావేశాలతో విజయ్‌ అప్పుడప్పుడూ బీజీగానే ఉన్నారు. అలాగే, ఒకే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయిస్తున్నారు.  

ఇకపోతే ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే లియో షూటింగ్‌ పనులు జరుగుతున్నాయి. మరోకటి  వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఇవి పూర్తి అయ్యేందుకే మరో రెండేళ్లు సమయం పడుతుంది. ఈ లోపు ఎన్నికలు మొదలవుతాయి. దీంతో తమిళ రాజకీయాల్లో ఆయన ఇంపాక్ట్‌ పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. కానీ విజయ్‌ పార్టీని ప్రారంభిస్తే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకే లాభంగా మారొచ్చని చర్చ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా అధికార పార్టీకే ఎక్కువ లాభం చేకూరుతుందని పొలిటికల్‌ టాక్‌.

రాజకీయాల్లో సినిమా గ్లామర్‌ కష్టమేనా?
తమిళనాడు సినీ రాజకీయాల​ చరిత్ర చూస్తే.. పాత తరం వారు మాత్రమే రాజకీయాల్లో రానించారని తెలుస్తోంది.  కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత మాత్రమే అక్కడి పొలిటికల్‌ డ్రామాలో సూపర్‌హిట్‌ కొట్టారు. తర్వాత వచ్చిన విజయ్‌ కాంత్‌, శరత్‌ కుమార్‌, కుష్బూ, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వీరిలో ఎవరూ రాజకీయాల్లో మెప్పించలేదనే చెప్పవచ్చు. మరి తాజాగా పొలిటికల్‌ గేమ్‌లో అడుగుపెట్టాలనుకుంటన్న విజయ్‌ ఏ మేరకు రానిస్తాడో తెలియాలంటే  2026 ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Advertisement
Advertisement