
అందనాల్ చిత్రం విడుదలకు ముందే అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతోంది. ఆర్యన్ శ్యామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. ఆది ప్రసాద్, లీమా ఎస్.బాబు కథానాయికలుగా నటించిన ఇందులో కిశోర్ రాజ్‌కుమార్, ఇమాన్ అన్నని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కదిరేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, కథనాన్ని ఆర్యన్ శ్యామ్ అందించారు. గ్రీన్ మ్యాజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ రఘునందన్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
అయితే నరబలి,బ్లాక్ మ్యాజిక్ ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డు చిత్రానికి ధ్రువీకరణ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో నిర్మాత రివైజింగ్ కమిటీకు వెళ్లి సర్టిఫికెట్ పొందారు. కాగా ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో 8 అవార్డులను గెలుచుకోవడం విశేషం. యూరప్ ఫిలిం ఫెస్టివల్‌లో చిత్ర దర్శకుడు వీవీ కదిరేశన్ ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కించుకున్నారు.
చిత్ర కథానాయకుడు ఆర్యన్ శ్యామ్ న్యూయార్క్ మూవీ అవార్డ్స్, అమెరికన్ గోల్డెన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, మెడుసా ఫిలిం ఫెస్టివల్, వరల్డ్ ఫిలిం కార్నివాల్ సింగపూర్ మొదలగు నాలుగు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో నూతన పరిచయ ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకోవడం విశేషం. నటుడు దర్శకుడు పార్తీబన్ సహకారంతో నటుడు ఆర్యన్ శ్యామ్ అందనాల్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రోత్సవాలకు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నటుడు పార్తీబన్ అందనాల్ చిత్ర కథానాయకుడు ఆర్యన్ శ్యామ్‌ను కలిసి అభినందించారు. అంతేకాకుండా త్వరలో వీరి కాంబినేషన్ నూతన చిత్రం తెరకెక్కబోతున్నట్లు ప్రకటించారు.