Taapsee Pannu: ఎప్పుడూ మీరే కరెక్ట్‌.. ప్రతిసారి మాదే తప్పు

Taapsee Pannu Argument With Paparazzi At Dobaara Event - Sakshi

‘ఝుమ్మంది నాదం’తో టాలీవుడ్‌కి పరిచయం అయిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను.. తొలి సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు వరస ఆఫర్లు, స్టార్‌ హీరో సరసన నటించిన ఆమె ఉన్నట్టుంటి బాలీవుడ్‌కు మాకాం మార్చింది. అక్కడ మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ భామ బాలీవుడ్‌లోనే సెటిలైపోయింది. అప్పుడప్పుడు 'మిషన్‌ ఇంపాజిబుల్‌' వంటి తెలుగు సినిమాలు చేస్తూ పలకరిస్తోంది. కాగా ఇటీవల స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన 'శభాష్‌ మిథూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఈ సినిమా విజయం సంగతి ఎలా ఉన్న మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది తాప్సి. ఈ సొట్ట బుగ్గల బ్యూటీ నటించిన తాజా చిత్రం 'దొబారా'. ఈ మూవీ ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది తాప్సీ. అయితే ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్లతో తాప్సీకి కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ముంబైలో సినిమా ప్రమోషన్‌ కోసం హాజరైన తాప్సీ గుమ్మం దగ్గర ఉన్న ఫొటోగ్రాఫర్లను పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయింది. వారు వెనుక నుంచి ఎంత పిలిచినా స్పందించలేదు. 'ఇప్పటికే ఆలస్యంగా వచ్చారు. కొద్దిగా ఆగి వెళ్లండి' అంటూ అరుస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయింది తాప్సీ. ఇక ఆమె బయటకు వచ్చిన తర్వాత వారితో చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. 

'నేనేం లేటుగా రాలేదు. నా టైం ప్రకారమే నేను వచ్చాను. నేను ఇప్పటివరకు ప్రతి చోటుకు సరైన సమయానికే వెళ్లాను. నేనేం తప్పు చేశానని అరుస్తున్నారు' అని అడిగింది తాప్సీ. అందుకు వారు 'మేము రెండు గంటల నుంచి మీకోసం ఎదురుచూస్తున్నాం. కానీ మేము పిలుస్తున్నా మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఏంటి?' అని నిలదీశారు. 'అందులో నా తప్పు ఏముంది? నా పని నేను చేసుకుంటూ.. వెళ్లిపోతున్నాను' అని చెప్పగా 'మేము మీకోసం రెండు గంటల నుంచి ఎదురుచూస్తున్నాం' అని ఫొటోగ్రాఫర్స్‌ గట్టిగా అరిచేసరికి 'దయచేసి మీరు నాతో మర్యాదగా మాట్లాడండి. నేను కూడా మీతో మర్యాదాగ మాట్లాడతాను' అంటూ గొడవకు దిగింది. తర్వాత పరిస్థితిని సద్దుమణిగించేందుకు పలువురు ఫొటోగ్రాఫర్లు ప్రయత్నించగా, తాప్సీ సహనటుడు పావైల్‌ గులాటి కూడా ఆమె వెనుక నిలబడ్డాడు. 

'కెమెరా నాపై ఉంది కాబట్టే నా వైపు మాత్రమే కనిపిస్తుంది. అదే ఒక్కసారి మీపై ఉంటే మీరు ఎలా నాతో మాట్లాడుతున్నారో మీకు అర్థమయ్యేదు. ఎప్పుడు మీరే కరెక్ట్‌. ప్రతిసారి నటీనటులదే తప్పు' అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. కొంతమంది నెటిజన్స్‌ 'తాప్సీకి ఎంత పొగరు' అని విమర్శిస్తుంటే, పలువురు 'ఆమె అలా మాట్లాడటంలో తప్పు ఏముంది?' అని సమర్థిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top