అమ్మ చనిపోయి 5 నెలలు.. వీడియో డిలీట్‌ చేయమని అడుక్కున్నా: సోహైల్‌ | Syed Sohel Ryan Disappointed over Naa Anveshana Comments | Sakshi
Sakshi News home page

Sohel: శివుడికి పాలాభిషేకం చేశా, కొండగట్టుకు వెళ్లా.. నేను ఉగ్రవాదినా?

Apr 30 2025 4:14 PM | Updated on Apr 30 2025 4:18 PM

Syed Sohel Ryan Disappointed over Naa Anveshana Comments

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసినవాళ్లందరినీ ఉగ్రవాదుల ఖాతాలో వేశాడు ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్‌ నా అన్వేషణ. బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న సోహైల్‌ (Syed Sohel Ryan), మెహబూబ్‌.. ఇలా ఎంతోమందిని ఉగ్రవాదులుగా పేర్కొన్నాడు. ఈ కామెంట్లపై నటుడు, తెలుగు బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్‌ సోహైల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు మాట్లాడుతూ.. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి పాల్పడ్డవాడు ఎక్కడికో పారిపోయాడు. వాడిని దొరకబట్టడం మానేసి మనదాంట్లో మనం కొట్టుకుచస్తున్నాం. 

నేను భారతీయుడిని
ఎక్కడో జరిగినదానికి నన్ను ఉగ్రవాదిగా చిత్రీకరించడమేంటి? బెట్టింగ్‌ యాప్స్‌ గురించి నన్ను తిట్టు.. అంతేకానీ ఉగ్రవాది అని ముద్ర వేయడమేంటి? వాడెవడో చెప్పినంత మాత్రాన నేను టెర్రరిస్టు అయిపోను. నేను భారతీయుడిని. కులమత బేధాలు లేకుండా పెరిగాను. శివుడికి పాలాభిషేకం చేశాను. సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. రంజాన్‌ ఉంటే హిందూ స్నేహితులు నాతోపాటు నమాజ్‌ చదివేవాళ్లు. క్రిస్టియన్‌ ఫ్రెండ్‌తో కలిసి చర్చికి వెళ్లేవాళ్లం. 

వాడి ప్లాన్‌ సక్సెస్‌.. నువ్వు ఫెయిల్‌
మా ఇరుగుపొరుగువారితో కలిసి కొండగట్టుకు వెళ్లిన రోజులున్నాయి. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింలు చాలామంది ఉన్నారు. అందులో నేనొకడిని. ఒక భారతీయుడివై ఉండి నన్ను ఉగ్రవాది అంటున్నావ్‌. నిజమైన ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా.. వాళ్ల మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ప్లాన్‌ సక్సెస్‌ అయినట్లే.. భారతీయుడిగా నువ్వు ఫెయిల్‌ అయినట్లే!

అడుక్కున్నా..
మొన్న ఒక మహిళ.. భర్తను ముక్కలుముక్కలుగా నరికేసి డ్రమ్‌లో వేసింది. ఆ క్రూరత్వాన్ని టెర్రరిజం అనాలి. నేను పుట్టించిన మనిషిని చంపే హక్కు నీకు లేదు అని ఇస్లాంలో రాసుంది. ఆ ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదు. నా తల్లిని పోగొట్టుకుని ఐదారునెలలవుతోంది. ఇంతలో నాపై ఇలాంటి కామెంట్లు వినేసరికి చాలా బాధపడ్డాను. నాపై చేసిన వీడియో డిలీట్‌ చేయమని ఆ యూట్యూబర్‌ (నా అన్వేషణ)ను అడుక్కున్నాను. 'మా అమ్మ గతేడాది చివర్లో చనిపోయారు. మా అమ్మపై బూతులు మాట్లాడావు. గుర్తుపెట్టుకో, నీకు కూడా తల్లి ఉంది. మీ తల్లిలాంటిదే నా తల్లి కూడా!

మీ వ్యూస్‌ కోసం నన్ను తిట్టుకోండి
నేను కూడా నిన్ను తిరిగి బూతులు అనొచ్చు. కానీ, అనను. మీ తల్లిదండ్రులను బాగా చూసుకో' అంటూ వీడియో డిలీట్‌ చేయమని మెసేజ్‌ చేశాను. కావాలంటే నన్ను తిట్టుకో, వ్యూస్‌ కోసం నన్ను ఎంతైనా తిట్టుకోండి. కానీ తల్లుల్ని తిట్టొద్దు. వాళ్లేం పాపం చేశారు. అందరికీ ఒకటే చెప్తున్నా.. మీ మతాన్ని ప్రేమించండి. మిగతా మతాల్ని గౌరవించండి అని సోహైల్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఫేమస్‌ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్‌ నాకొద్దని..: నాని

Advertisement
 
Advertisement
Advertisement