సీన్‌తో దీపావళి సెలబ్రేట్‌ చేసుకుందాం: సూర్య | Surya Scene Movie Pre-Release Event | Sakshi
Sakshi News home page

సీన్‌తో దీపావళి సెలబ్రేట్‌ చేసుకుందాం: సూర్య

Nov 3 2026 4:07 AM | Updated on Nov 3 2026 4:07 AM

Surya Scene Movie Pre-Release Event

నజ్రియా, సూర్య, వెంకీ అట్లూరి, ఎన్వీ ప్రసాద్,

‘‘సీన్‌’ చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ. కుటుంబ సభ్యులందరూ కలిసి థియేటర్లకు వచ్చి మా సినిమా చూడొచ్చు. ‘సీన్‌’ తో దీపావళి పండుగను సెలబ్రేట్‌ చేసుకుందాం’’ అని హీరో సూర్య పేర్కొన్నారు. ‘ఆవేశం’ ఫేమ్‌ జితు మాధవన్‌ దర్శకత్వంలో సూర్య, నజ్రియా నజీమ్‌ జంటగా నటించిన చిత్రం ‘సీన్‌’. నస్లేన్, ఆనంద్‌ రాజ్, లాల్, రాజ్‌ ప్రియన్‌ కీలక పాత్రలు పోషించారు. 

జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్  మెంట్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. జయశ్రీ దామోదరన్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 6న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌– తెలంగాణలో ఎన్వీఆర్‌ సినిమా ద్వారా ఎన్వీ ప్రసాద్, సురేశ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ–‘‘నాపై నమ్మకంతో ‘సీన్‌’ ని తెలుగులో విడుదల చేస్తున్న ప్రసాద్, సురేశ్‌గార్లకు థ్యాంక్స్‌. నా కెరీర్‌లో ఈ సంవత్సరం చాలా అందమైనది. 

ఈ ఏడాది మూడోసారి(వీరభద్రుడు, విశ్వనాథన్‌ అండ్‌ సన్స్, సీన్‌) నేను మీ ముందుకు వస్తున్నాను.. ఇదంతా మీ ఆశీర్వాదమే. అయితే నాగార్జున సర్‌ ఇలాంటి ఫీట్‌ని ఎప్పుడో సాధించారు. మనం ఇప్పుడు పాన్‌ ఇండియా పాన్‌ ఇండియా అంటూ రిపీట్‌ చేస్తున్నాం. కానీ, నాగార్జున సర్‌ ఎప్పుడో ఈ ఫీట్‌ని సాధించారు. ఇంతకుముందే ఇతర భాషల డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశారాయన. అన్ని ఇండస్ట్రీలను కలుపుకుంటూ వర్క్‌ చేసేవారు. మణిరత్నం గారు, ప్రియదర్శన్‌ గారు,  మహేష్‌ భట్‌ గారు.. ఇలా ఎంతోమంది దర్శకులతో కలిసి పనిచేశారు నాగార్జున సర్‌.

 ఆ విషయాన్ని ఒక నటుడిగా నేను కూడా గుర్తుపెట్టుకున్నాను. తెలుగు డైరెక్టరైన వెంకీ అట్లూరిగారితో ‘విశ్వనాథన్‌ అండ్‌ సన్స్‌’ మూవీ చేశాను. ఈ సినిమా నాకు ఎంత గుర్తింపు ఇచ్చిందంటే నేను ఎక్కడికి వెళ్లినా చాలా అందమైన చిత్రం అంటూ మాట్లాడుతున్నారు. ‘సీన్‌’ ని జీతు మాధవన్‌ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో మర్డర్‌ మిస్టరీ, మ్యాడ్‌నెస్, నవ్వులు.. అన్నీ ఉన్నాయి. నజ్రియాతో కలిసి పనిచేయడం సంతోషంగా అనిపించింది’’ అని చెప్పారు. 

నజ్రియా నజీమ్‌ మాట్లాడుతూ–‘‘సీన్‌’ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్ లు చేశాను’’ అన్నారు. ‘‘సంవత్సరంలో 365 రోజులు సినిమా కోసమే పనిచేసే సూర్యగారికి మనం సెల్యూట్‌ చెప్పాలి’’ అన్నారు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి. ‘‘ఈ ఏడాది ‘వీరభద్రుడు’, ‘విశ్వనాథన్‌ అండ్‌ సన్స్ ’, ఇప్పుడు ‘సీన్‌’.. కచ్చితంగా ఈ సినిమా సూర్యగారికి హ్యాట్రిక్‌ హిట్‌ అవుతుంది’’ అని ఎన్వీ ప్రసాద్‌ పేర్కొన్నారు. ‘‘అగరం స్టూడియోస్‌లో మేము చేసిన తొలి సినిమా ‘సీన్‌’. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు జయశ్రీ దామోదరన్‌. ఈ వేడుకలో నిర్మాత సుప్రియ, రచయిత రాకేందు మౌళి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement