
భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి అంటున్నాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. ఆమాత్రం అర్థం చేసుకోకపోతే సంబంధాలు ఎలా నిలుస్తాయని ప్రశ్నిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి (Suniel Shetty) మాట్లాడుతూ.. ఈరోజుల్లో పిల్లలకు బొత్తిగా ఓపిక ఉండట్లేదు. పెళ్లి అంటే కాంప్రమైజ్ అనుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటే.. పెళ్లంటే ఒకరికోసం మరొకరు జీవించడం.
భార్య పిల్లల్ని చూసుకోవాలి
మీకు పిల్లలు ప్టుటారే అనుకోండి.. భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భర్త కెరీర్ కూడా ముఖ్యమే కదా అని ఆలోచించి పిల్లల బాధ్యత తీసుకోవాలి. భర్త కూడా పిల్లల గురించి ఆలోచిస్తాడు, వారికి అండగా నిలబడతాడు. కానీ ఈరోజుల్లో ప్రతిదానికీ టెన్షన్ పడుతున్నారు. అన్నింటినీ ఒత్తిడిలా ఫీలవుతున్నారు. పైగా ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చేవాళ్లే!
పెద్దవాళ్లను చూసి నేర్చుకోండి
తల్లి ఎలా ఉండాలి? తండ్రి ఎలా ఉండాలి? ఏం తినాలి? ఏం చేయాలి? ఇవన్నీ ఆన్‌లైన్‌లో కూడా కనిపిస్తాయి. వాటితో ఇంట్లో వాళ్లను పోలుస్తూ.. నా భాగస్వామి ఇలా లేదేంటని బాధపడతారు. ఏదైనా సరే అనుభవాల నుంచి నేర్చుకుంటేనే మంచిది, లేదంటే అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, అక్క, వదినలు.. వీరిని చూసి కూడా ఎంతోకొంత నేర్చుకోవచ్చు. వారిలో మీకు పనికొచ్చే లక్షణాలను ఎంపిక చేసి ఆచరించండి. పనికిరానివి వదిలేయండి. కానీ అవన్నీ ఇప్పుడెవరు చేస్తున్నారు. అలా పెళ్లయిందో లేదో ఇలా విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు.
ఫస్ట్ సినిమాకు ముందే 40 చిత్రాలు
సినీ జర్నీ గురించి మాట్లాడుతూ.. నా తొలి సినిమా రిలీజవ్వడానికి ముందే నా చేతిలో 40 చిత్రాలున్నాయి. అందులో ఏవి ఆడతాయి? ఏవి ఫ్లాప్ అవుతాయి? అని నేను పెద్దగా ఆలోచించలేదు. అప్పట్లో మానసిక ఆరోగ్యం, డిప్రెషన్ అన్న పదాలే మాకు తెలియవు. కాస్త బాధపడుకుంటూ ఉన్నా సరే అమ్మ వచ్చి తిట్టగానే అదెటో వెళ్లిపోయేది. బాధపడుతూ కూర్చునేంత టైం ఇచ్చేవాళ్లు కాదు అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ రోజుల్లో మానసిక ఆరోగ్యం దిగజారుతున్న నేపథ్యంలో 2023లో సునీల్ శెట్టి లెట్స్ గెట్ హ్యాపీ అనే హెల్త్ యాప్ రిలీజ్ చేశాడు. సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో అనేక చిత్రాలు సునీల్ శెట్టి తెలుగులో మోసగాళ్లు, గని మూవీస్‌లో కనిపించాడు. ప్రస్తుతం వెల్‌కమ్ టు ద జంగిల్ చిత్రంలో నటిస్తున్నాడు.
చదవండి: బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్