
కొత్త సినిమాలు వస్తున్నా సరే పాత చిత్రాలను ఇంకా రీరిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మహేశ్‌బాబు హీరోగా నటించిన క్లాసిక్ మూవీ అతడు (Athadu Movie Re Release)ను వచ్చే నెలలో మళ్లీ విడుదల చేస్తున్నారు. మహేశ్ బర్త్‌డే రోజైన ఆగస్టు 9న అతడు రీరిలీజ్ కానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చిత్ర నిర్మాత మురళీ మోహన్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు.
అప్పటికే సినిమాలకు దూరం..
ఈ సినిమాలో శోభన్‌బాబు నటించాల్సిందని, కానీ ఆయన రిజెక్ట్ చేశారని పేర్కొన్నారు. మురళీ మోహన్ (Murali Mohan) మాట్లాడుతూ.. అప్పటికే శోభన్‌బాబు సినిమాలు చేయడం ఆపేశారు. అతడు మూవీలో నాజర్ వేసిన క్యారెక్టర్ శోభన్‌బాబు వేస్తే బాగుంటుందనిపించింది. డైరెక్టర్ త్రివిక్రమ్‌తో చెప్తే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? అన్నాడు. అప్పటికే మేము హైదరాబాద్ వచ్చేశాం. ఆయన చెన్నైలోనే ఉన్నారు. నేను నేరుగా అడగడానికి మొహమాటపడి మేకప్‌మెన్ రామును పిలిచాను.
ఖాళీ చెక్..
ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి రాముతో చెన్నై పంపించాం. రెమ్యునరేషన్ తనకెంత కావాలనుకుంటే అంత రాసుకోమన్నాం. దాని గురించి బేరమాడాలనుకోలేదు. ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే ఆ పాత్రకు ప్రాముఖ్యత పెరుగుతుంది, సినిమాకు విలువ వస్తుందనుకున్నాను. కానీ శోభన్‌బాబు (Sobhan Babu) ఫోన్ చేసి.. సారీ, మురళీ మోహన్‌గారు, ఏమీ అనుకోవద్దు.
హీరోగానే గుర్తుండిపోవాలి
ఎవరైనా శోభన్‌బాబు అని గుర్తు చేసుకోగానే హీరోగా అందంగా, టిప్‌టాప్‌గా కనిపించాలే తప్ప తండ్రిగా, తాతగా, రోగిష్టిగా వారికి గుర్తు రాకూడదు. అలాంటి క్యారెక్టర్లు నేను చేయదల్చుకోలేదు. మీరేం అనుకోవద్దు. ఇది కచ్చితంగా మంచి సినిమా అయ్యుంటుంది, లేకపోతే మీరు తీయరు. నాకు ఇచ్చిన పాత్ర కూడా మంచిదే అయ్యుంటుంది, లేకుంటే మీరు నన్ను అడగరు. దయచేసి ఏమీ అనుకోవద్దు. నేను చేయలేనని తిరస్కరించారు అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.