‘వారణాసి’ సినిమా కోసం ఓ సరికొత్త కల్పిత భాషలో డైలాగ్స్ చెప్పనున్నారట మహేశ్‌బాబు. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మైథాలజీ అండ్ టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీ రాముడు... ఇలా రెండు విభిన్నమైన గెటప్స్‌లో మహేశ్‌బాబు నటిస్తున్నారు. ఈ కథ రీత్యా కాలానికి అతీతంగా రుద్ర ఓ సాహసోపేతమైన ప్రయాణం చేయాల్సి ఉంటుందని తెలిసింది.
ఇలా తన లక్ష్యంలో భాగంగా ఓ గుహలోని రాతి గోడలపై ఉన్న భాషను రుద్ర డీకోడ్ చేయాల్సి ఉంటుందట. ఈ భాషనే సిద్ధం చేస్తున్నారట రాజమౌళి. ఆయన దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ సినిమాలోని కాలకేయులు కిలికి అనే కల్పిత భాషలో మాట్లాడిన విషయం తెలిసిందే.
డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ మదన్ కార్కే నేతృత్వంలో ఈ కిలికి భాషను డిజైన్ చేయించారు రాజమౌళి. ఈ భాష ప్రేక్షకులను ఆకర్షించింది. తాజాగా ఇలాంటి తరహాలోనే ‘వారణాసి’ కోసం కూడా రాజమౌళి ఓ కల్పిత భాషను సిద్ధం చేయిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎస్‌ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.


