డీప్‌ఫేక్‌ బారిన సోనూసూద్‌.. వీడియో వైరల్‌! | Sakshi
Sakshi News home page

డీప్‌ఫేక్‌ బారిన సోనూసూద్‌.. అభిమానుల నుంచి డబ్బులు వసూలు!

Published Sat, Jan 20 2024 4:20 PM

Sonu Sood Deepfake Video Goes Viral - Sakshi

సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రష్మిక, అలియా భట్‌, కృతిసనన్‌ లాంటి స్టార్‌ హీరోయిన్ల‍కు సబంధించిన డీప్‌ఫేక్‌ వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. తాజాగా ప్రముఖ నటుడు, ‘రియల్‌ హీరో’ సోనూసూద్‌ సైతం డీప్‌ఫేక్‌ బారిన పడ్డాడు. సైబర్‌ నేరగాళ్లు సోనుసూద్‌ డీప్‌ఫేక్‌ వీడియోతో మోసాలకు పాల్పడుతున్నారు. అతని ఫేస్‌తో ఫేక్ వీడియో రెడీ చేసి.. అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోనూసూద్‌ తన ట్విటర్‌(ఎక్స్‌) ఖాతాలో  షేర్‌ చేస్తూ.. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.  

(చదవండి: రష్మిక వీడియో.. డీప్‌ ఫేకర్‌ అరెస్ట్‌)

‘కొందరు నా డీప్‌ఫేక్‌ వీడియోని క్రియేట్‌ చేసి అభిమానులతో చాటింగ్‌, వీడియో కాల్స్‌ చేస్తూ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారు.  కొంతమంది ఫ్యాన్స్‌  ఈ వీడియోలో ఉన్నది నేనే అనుకొని సైబర్‌ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ఇలాంటి వీడియో కాల్స్‌ వస్తే నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి.  నిజ జీవితంలో జరిగిన ఇలాంటి ఘటనల మీదే నేను ఫతే అనే సినిమా తీస్తున్నాను. ఫేక్‌ వీడియోస్‌, లోన్‌ యాప్స్‌ వల్ల జరుగుతున్న సైబర్‌ నేరాలను ఆ సినిమాలో చూపించబోతున్నాం’అని సోనూసూద్‌ తెలిపారు. 

రష్మికకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ కావడంతో డీప్‌ఫేక్‌ వ్యవహారం బయటపడింది. ఆ తర్వాత సినీ సెలెబ్రిటీలు వరుసగా డీప్‌ఫేక్‌ బారిన పడ్డారు.  మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియో కూడా ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. వీటిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా రష్మిక డీప్‌ఫేక్‌ వీడియోను తయారు చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తియే ఈ ఫేక్‌ వీడియో తయారు చేసినట్లు తెలుస్తోంది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement