మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ క్యామియో ఇస్తారంటూ సినిమా రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో చరణ్ అయ్యప్ప మాల వేయడం, సినిమా నేపథ్యం కూడా అయ్యప్ప స్వామికి సంబంధించినదే కావడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.
తాజాగా ‘ఇరుముడి’ సూపర్ హిట్ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్‌లో చరణ్ నటిస్తారా? అనే ప్రశ్న దర్శకుడు శివ నిర్వాణకు ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘చరణ్ మా సినిమాలో ఉంటే అద్భుతంగా ఉండేది. కానీ ‘ఇరుముడి’ తీసేటప్పుడు ఆయనను క్యామియోగా తీసుకోవాలనే ఆలోచనే మాకు రాలేదు. ఈ ప్రచారం సోషల్ మీడియాలోనే మొదట చూశాను. ఆ తర్వాత మీడియా మిత్రులు కూడా అడగడంతో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది’’ అని చెప్పారు.
అయితే కథకు సహజంగా అలాంటి పాత్ర అవసరమైతే చరణ్‌తో పనిచేయడం అద్భుతంగా ఉంటుందని శివ నిర్వాణ తెలిపారు. ముందుగా స్టార్‌ను అనుకుని పాత్రను సృష్టించడం తన విధానం కాదని స్పష్టం చేశారు. ‘ఇరుముడి’ కథ సహజంగా పుట్టింది. మాలలో ఉన్న ఓ వ్యక్తికి తాగుడు అలవాటు ఉండటం, ఆ వ్యక్తి తన కూతురు కోసం అయ్యప్ప మాల వేయడం, ఆ 41 రోజుల దీక్షలో అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పుల ఆధారంగా ఈ కథను చాలా సహజంగా అభివృద్ధి చేశాం. అందుకే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిందనే కారణంతో వెంటనే ‘ఇరుముడి 2’ కథ రాయలేను. మరో సహజమైన కథా పాయింట్ దొరికితేనే ఇరుముడి సీక్వెల్‌పై ఆలోచిస్తానని శివ నిర్వాణ స్పష్టం చేశారు.
'ఇరుముడి' సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి కూర్చుని ఉండగా.. పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్నారు. మూడో వారాంతంలోకి వచ్చినా 'ఇరుముడి' జోరు ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ వారం వచ్చే సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ కనిపించట్లేదు. చూస్తుంటే ఈ వీకెండ్ కూడా రవితేజ తన హవా చూపించేలానే కనిపిస్తున్నాడు.


