‘‘ప్రేక్షకులు నా నుంచి ‘కితకితలు, బెండు అప్పారావు’ వంటి వినోదాత్మక సినిమాలు మిస్ అవుతున్నారు. అలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నప్పుడు చంద్రమోహన్ ‘రంభ ఊర్వశి మేనక’ కథ చెప్పారు. ఈ కథ నాతో పాటు నాగార్జున, సుప్రియ, రాజేష్, నిమ్మకాయల ప్రసాద్‌గార్లకు కూడా నచ్చింది. ఇలా చాలా రోజుల తర్వాత ‘రంభ ఊర్వశి మేనక’ వంటి వినోదాత్మక చిత్రం చేశాను’’ అని ‘అల్లరి’ నరేశ్ తెలిపారు.
చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి హీరోయిన్‌గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘అల్లరి’ నరేశ్ విలేకరులతో పంచుకున్న విశేషాలు...
⇒ ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. ఇందులో హీరోకి ఒక డ్రామా కంపెనీ ఉంటుంది. ‘రంభ ఊర్వశి మేనక’ను దేవతల్లా పూజిస్తుంటాడు. పైగా కష్టపడకుండా హీరో అయి పోవాలనే పాత్ర. తన కుటుంబానికి ముత్తాతల నుంచి వస్తున్న ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఒకప్యాట్రన్ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారనే నమ్మకం ఉంటుంది. హీరో ఆప్యాట్రన్ ఎలా గీశాడు? రంభ, ఊర్వశి, మేనక భువికి వచ్చిన తర్వాత ఎలాంటి ఘటనలు జరిగాయనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది.
⇒ నా బాడీ లాంగ్వేజ్‌కి సరిపడే కామెడీని చంద్రశేఖర్ బాగా డిజైన్ చేశారు. పైగా ప్రేక్షకులు స్వర్గం, నరకం, ఇంద్రలోకం లాంటి కథలు చూసి చాలా కాలమైంది. పెద్దలే కాదు... చిన్నపిల్లలూ చాలా ఎగ్జయిట్ అవుతారు. క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘రంభ ఊర్వశి మేనక’ మా నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) శైలిలో చేసిన సినిమా. అంత పెద్ద స్టార్ కాస్ట్ ఇందులో ఉంది.
⇒ ఇకపై రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలని భావిస్తున్నాను. నటుడిగా ఇంకా విజయవంతమైన చిత్రాలు చేసిన తర్వాతే దర్శకత్వం గురించి ఆలోచిస్తాను. నేను నటించిన ‘ఆల్కహాల్’ మూవీ రిలీజ్ రెడీగా ఉంది. ‘కనకదుర్గ’ సినిమా షూటింగ్ జరుగుతోంది.


