శ్రీరామ్, సుమన్, లక్ష్మణ రావు, మైకిల్
శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా రాముడు అందరివాడు’. సుమన్, సమ్మెట గాంధీ, నాగమహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ అతిథులుగా హాజరై, ‘మా రాముడు అందరివాడు’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో ముఖ్యమంత్రిగా మంచి సందేశం ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు’’ అని తెలిపారు. లక్ష్మణరావు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు విలన్ పాత్ర చేశాను. మాకు స పోర్ట్ చేయాలని ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారిని కోరాం.
కానీ, పట్టించుకోలేదు. తర్వాత మా ట్రైలర్ చూసి వారే బాగుందని చెప్పారు’’ అని పేర్కొన్నారు. ‘‘తండ్రీ కొడుకుల భావోద్వేగంతో రూపొందిన మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు మైకిల్. ‘‘తెలుగువాళ్లం మనల్ని మనం ప్రోత్సహించుకుంటేనే నిరూపించుకుంటాం’’ అని శ్రీరామ్ చెప్పారు.


