సందీప్, ఆది సాయికుమార్, దరహాస్, శైలజ, నిఖిల్
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 7 పీఎం ప్రోడక్షన్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ‘ఈ.ఎమ్.ఐ.’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకుడు. సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని నిర్మాతలు. ‘లాల్ సలామ్, హాస్టల్ డేస్’ వంటి వెబ్ సిరీస్‌లతో పేరు తెచ్చుకున్న దరహాస్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు.
‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో ఓ కీలక పాత్రతో ఫేమస్ అయిన శైలజ ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. బుధవారం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇచ్చారు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రదర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందజేశారు.
‘‘బైక్, కారు, ఫోన్... ఇలా ఏ వస్తువు కొన్నా ఈ.ఎమ్.ఐ. కట్టాల్సిందే. దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఈ కష్టాలు తప్పవు. ఈ.ఎమ్.ఐ. చెల్లించేందుకు యువత ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అనే కాన్సెప్ట్‌తో, హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం సాగుతుంది. రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాం’’ అని సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని తెలిపారు.


