ప్రముఖ గాయని ఎస్.జానకి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ సింగర్ చిత్ర సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. మురళీకృష్ణ మరణం తనను షాక్‌కు గురిచేసిందని తాను మంచి సోదరుడిని కోల్పోయానంటూ తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కోరారు. మురళీకృష్ణకు కూడా సినీ రంగంతో అనుబంధం ఉంది. వినాయకుడు, మల్లెపువ్వు వంటి సినిమాల్లో ఆయన నటించారు. భరతనాట్యంలో ఆయనకు ప్రావీణ్యం ఉంది. పలువురు విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు. మురళీకృష్ణ మరణంతో సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.


