
'ఆకాశం ఏనాటిదో.. అభిమానం ఆనాటిది' అంటూ నిరీక్షణ (1982) సినిమాతో తొలిసారి వెండితెరపై హీరోయిన్‌గా 'అర్చన' మెరిశారు. ఈ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మొదట రంగు తక్కువ అంటూ నటిగా తిరస్కరణకు గురైన ఆమె... ఆ తర్వాత వరుసగా రెండు సార్లు జాతీయ అవార్డు సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగు కుటుంబానికి చెందిన అర్చన.. తమిళ అమ్మాయిగా స్థిరపడిపోయారు. ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు బాలుమహేంద్రనే నిరీక్షణ సినిమాతో హీరోయిన్‌ను చేశారు. గిరిజన యువతి పాత్రలో బ్లౌజ్ లేకుండా నటించడంపై ఆమె తొలిసారి స్పందించారు.
సుమారు 20 ఏళ్ల తర్వాత 'షష్టి పూర్తి' సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను నటి అర్చన పలకరించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె నటించిన తొలి సినిమా గురించి ఇలా చెప్పారు. 'నిరీక్షణ సినిమాలో గిరిజన యువతి పాత్రలో నటించడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఆరోజుల్లోనే బ్లౌజ్ లేకుండా సినిమా అంతా నటిస్తున్నానని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. నేను నా దర్శకుణ్ని నమ్మాను. అప్పటికే ఆయన చిత్రీకరించిన ఏ సినిమాలోనూ అశ్లీలతతో పాటు గ్లామర్‌ను ప్రదర్శించడం అనేది లేదు.

అందుకే, ఏమీ ఆలోచించకుండా నిరీక్షణలో నటించాను. నా జీవితంలోనే ప్రత్యేకమైన సినిమా ఇదే. మలయాళంలో మమ్ముట్టి, శోభనలతో బాలుమహేంద్రనే తెరకెక్కించారు. తెలుగులో నేను, భానుచందర్ నటించాం. దర్శకుడి మీద నమ్మకంతోనే బ్లౌజ్ లేకున్నా సరే నటిస్తానని చెప్పాను. అనుకున్నట్లుగానే ఆయన చాలా పవిత్రంగానే ఆ పాత్రను ప్రేక్షకులకు చూపించారు. నిరీక్షణ సినిమాతో నాకు ఒక అన్నయ్య (భానుచందర్) దొరికాడు. ఆ బంధం ఇప్పటికీ ఉంది.' అని ఆమె అన్నారు.
నిరీక్షణ సినిమాలో భాను చందర్ .. అటవీశాఖాధికారిగా నటించగా అర్చన గిరిజన్ యువతి పాత్రలో మెప్పించింది. ఇప్పటికే ఈ చిత్రం చాలామందికి ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ఈ మూవీ విడుదల తర్వాత అర్చనకు భారీ అవకాశాలు వచ్చాయి. వీడు (1987), దాసి (1988) చిత్రాలకు గాను రెండుసార్లు జాతీయ ఉత్తమ నటిగా అర్చన అవార్డు అందుకున్నారు.