
టాలీవుడ్ అభిమానుల్లో క్రేజ్ దక్కించుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. కన్నడలో కేజీఎఫ్ తర్వాత తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. గతేడాది డబుల్ ఇస్మార్ట్ మూవీతో అలరించిన సంజయ్ దత్.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తోన్న ది రాజాసాబ్లో నటిస్తున్నారు. అంతేకాకుండా సౌత్ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన కేడీ ది డెవిల్ అనే కన్నడ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ధృవసర్జా హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్కు సంజయ్ దత్ హాజరయ్యారు. హైదరాబాద్లో ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
1998లో వచ్చిన టాలీవుడ్ మూవీ చంద్రలేఖ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సంజయ్ దత్ స్పందించారు. నాగార్జున అడిగడంతోనే ఈ సినిమా చేశానని సంజయ్ దత్ తెలిపారు. నాగ్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అని.. తనకు బ్రదర్ లాంటివాడని అన్నారు. అలాగే రామ్ కూడా తనకు తమ్ముడులాంటి వాడని సంజయ్ దత్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రభాస్ ఫుడ్ చాలా పెట్టేవాడని.. తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. చంద్రలేఖ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు.