
హీరోయిన్ సమీరా రెడ్డి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఒక సమయంలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. అశోక్, జై చిరంజీవ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమీరా.. 2014లో అక్షయ్‌ని వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ప్రస్తుతం సమీరా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటోంది.
అయితే పెళ్లి తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పులతో విపరీతంగా ట్రోలింగ్కు గురైనట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన బాడీపై ట్రోల్స్ చేయడంతో తీవ్రమైన నిరాశకు గురయ్యానని తెలిపింది. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలా బరువు పెరిగానని పేర్కొంది. ఈ సమయంలో కష్టకాలం ఎదుర్కొన్నట్లు తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. అప్పట్లో తన బరువు ఏకంగా 105 కేజీలకు చేరుకుందని తెలిపింది. బరువు పెరగడం వల్లే తనను ట్రోల్ చేశారని వివరించింది.
సమీరా మాట్లాడుతూ.. 'ప్రజలు మంచివాళ్లు కాదు. వాళ్లు ఏదైనా చెప్పాలనుకుంటే మొహం మీదే చెబుతారు. నన్ను ట్రోల్ చేసే విషయంలో మా పక్కవాళ్లు కూడా నన్ను వదిలిపెట్టలేదని నేను ఎప్పుడూ చెబుతాను. ఆ సమయంలో నేను ఎలాంటి బాధను అనుభవిస్తున్నానో ఎవరికీ అర్థం కాదు. అందుకే ఈ విషయంలో నేను ఎలాంటి అబద్ధం చెప్పను" అని అన్నారు. కాగా.. సమీరా రెడ్డి 13 ఏళ్ల తర్వాత చిమ్ని అనే హర్రర్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.