
రవితేజ తాజా చిత్రం ‘మాస్ జాతర’ విడుదల వాయిదా పడుతున్నట్లు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లే నిజమయ్యాయి. ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రం ఆగస్ట్ 27న విడుదల కావాల్సింది. కానీ ఇటీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు మరియు కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా.. సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో సిద్ధం చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు.
కంగారుగా సినిమాని విడుదల చేయడం కంటే.. కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. మాస్ జతార చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అభిమానులు నిరీక్షణకు బహుమానంగా త్వరలో ఆశ్చర్యకర కంటెంట్ రాబోతుందని నిర్మాతలు హామీ ఇచ్చారు
మాస్ జాతర విషయానికొస్తే.. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల మళ్లీ జంటగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.