
డ్రాగన్ మూవీతో తెలుగు ఆడియన్స్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ ఏడాదిలో రిలీజైన చిత్రం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అదే ఊపులో మరో రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా వస్తోన్న లేటేస్ట్ సినిమా డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.
అయితే ఈ మూవీ రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచి టికెట్ బుకింగ్‌లు ఓపెన్ కావడంతో ఓవర్‌సీస్‌లో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. తమిళ సినిమాకు తెలుగు ఆడియన్స్ ఎక్కువగా టికెట్స్ బుక్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు తమిళ వర్షన్‌కు 27 వేల డాలర్లు రాగా.. తెలుగు వర్షన్‌కు 32 వేల డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఈ సినిమా విడుదలకు ముందే కలెక్షన్స్ జోరు చూస్తుంటే సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలైన లవ్ టుడే (2022), డ్రాగన్ (2025) తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్నాయి. లవ్ టుడే తెలుగు వెర్షన్ రూ.11.81 కోట్ల నికర కలెక్షన్లు సాధించింది. ఓవరాల్‌గా ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.66.57 కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో డ్రాగన్ చిత్రానికి రూ.18.68 కోట్లు రాగా.. ఇండియాలో రూ.101.34 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా.. ఇప్పటికే డ్యూడ్ భారతదేశంలో రూ.17.26 లక్షలు ముందస్తు బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, శరత్ కుమార్, హృదు హరూన్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు.