
చలనచిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగులో తొలి మహిళా సింగర్ రావు బాలసరస్వతి దేవి (97) (Raavu Balasaraswathi Devi) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం (అక్టోబర్ 15) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బాలసరస్వతి.. స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు.
1928లో పుట్టిన ఆమె ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టారు. మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగువారికి పరిచయమయ్యారు. సతీ అనసూయ (1936) సినిమాలో తొలిసారి పాట పాడారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక పాటలు ఆలపించారు. దాదాపు రెండువేలకి పైగా సాంగ్స్ పాడారు.
సింగర్ జర్నీ
సరస్వతి నాలుగేళ్ల వయసులోనే పలు స్టేజీలపై సాంగ్స్ పాడారు. ఆరో ఏట హెచ్.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్‌లో రికార్డు చేసింది. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్‌ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగులో తొలి నేపథ్య గాయని రికార్డు కూడా తనదే! భక్త ధ్రువ, ఇల్లాలు, రాధిక వంటి పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేశారు.
పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు సినిమాల్లో పాడటం మానేశారు. కానీ గొంతు సవరించుకోవడం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారు. కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. అలా చివరి వరకు పాడుతూనే ఉన్నారు.