
సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ పడితే.. సదరు దర్శకుడి, హీరో చుట్టూ నిర్మాతలు క్యూ కడతారు. అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ కొన్నాళ్ల పాటు ఎదురు చూస్తారు. దర్శకుడు వేణు(Venu Yeldandi) విషయంలోనూ అదే జరిగింది. ‘బలగం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు దగ్గరకు చాలా మంది నిర్మాతలు ఆయన దగ్గరకు వెళ్లారు. అడ్వాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వేణు మాత్రం తనకు అవకాశం ఇచ్చి దిల్ రాజుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. అదే ‘ఎల్లమ్మ’(Yellamma).
నానితో ప్లాన్
బలగం చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించింది దర్శకుడు వేణు రాసుకున్న కథే. పల్లెటూరి నేపథ్యంలో రాసుకున్న ఆ కథ అందరికి కనెక్ట్ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వెంటనే ‘ఎల్లమ్మ’ ప్రాజెక్టును ప్రకటించాడు. దిల్ రాజు బ్యానర్‌లోనే సినిమా ఉంటుందని కూడా చెప్పాడు. నిర్మాత దిల్ రాజు కూడా ఎల్లమ్మ ప్రాజెక్ట్‌ని త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్లామని చెప్పాడు. తొలుత ఈ కథను నాని(Nani)తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నాని, వేణు కూడా పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పారు. కానీ కొన్నాళ్ల తర్వాత నాని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. ఎల్లమ్మ సినిమా తాను చేయడం లేదని తేల్చేశాడు. ఇతర కమిట్మెంట్స్తో బీజీగా ఉండడం వల్లే ఆయన తప్పుకున్నట్లు సమాచారం.
కొంపముంచిన ‘తమ్ముడు’
నాని తప్పుకున్న కొన్నాళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు నితిన్ చేతికి వెళ్లింది. ఆయనకు కథ బాగా నచ్చడంతో ఓకే కూడా చెప్పేశాడు. తమ్ముడు రిలీజ్కి ముందు ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లోనూ నితిన్ తన తర్వాతి ప్రాజెక్టు ఎల్లమ్మనే అని చెప్పేశాడు. దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పాడు. కానీ తమ్ముడు రిలీజ్ తర్వాత పరిస్థితులు తారుమారు అయ్యాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్గా మిగిలిపోయింది. దీంతో ఎల్లమ్మ ప్రాజెక్టు నుంచి నితిన్ కూడా తప్పుకున్నాడు. బడ్జెట్ ఇష్యూస్ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి నితిన్ తప్పుకున్నట్లు టాలీవుడ్ టాక్.
‘బెల్లం’ చెంతకు ‘ఎల్లమ్మ’
ఎల్లమ్మ కథ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరకు వచ్చింది. ఆయనకు కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. బడ్జెట్ దృష్ట్యా బెల్లకొండ అయితేనే ఈ చిత్రానికి సెట్ అవుతాడని దిల్ రాజు భావిస్తున్నాడట. ఇటీవల కిష్కింధపురి చిత్రంతో మంచి విషయాన్ని ఖాతాలో వేసుకున్నాడు బెల్లంకొండ. ఇప్పుడు అదే జోష్తో వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తున్నాడు. ఎల్లమ్మకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.