
పెద్దరికం, రాజసం, గాంభీర్యం.. ఆయన కనిపిస్తే ఇవన్నీ కలపోసినట్లుగా ఉంటాయి. ఆయనే టాలీవుడ్ నటుడు రంగనాథ్. మూడు వందలకు పైగా సినిమాలు చేసిన ఆయన 2015లో తన నివాసంలో ఉరేసుకుని చనిపోయారు. గోడలపై పనిమనిషి మీనాక్షి పేరు రాసి తన పేరిట ఉన్న బాండ్స్‌ను ఆమెకు అప్పగించాలని కోరారు. రంగనాథ్ జీవితం గురించి, చివరి రోజుల గురించి ఆయన కుమారుడు నాగేంద్ర కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
అమ్మ చనిపోయాక..
'1995లో అమ్మ మంచానపడింది. నడుము కింది భాగానికి స్పర్శ లేకుండా పోయింది. తను ఎప్పటికీ కోలుకోలేదని డాక్టర్లు చెప్పారు. అప్పుడు నాన్న, నేను ఇంటిపనులు విభజించుకున్నాం. నాన్న వంట చేస్తే నేను ఇల్లు తుడిచి గిన్నెలు తోమేవాడిని. అమ్మ బాత్రూమ్ వెళ్తే కూడా మేమిద్దరమే క్లీన్ చేసేవాళ్లం. మనుషుల్ని మాట్లాడుకున్నా కొద్దిరోజులకే పని మానేసేవారు. అక్క పెళ్లి కోసం నాన్న ఇల్లమ్మేశాడు. అప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం.
రూ.800 అద్దె ఇంట్లోకి..
సినిమాలు తగ్గిపోవడంతో రూ.2,500 అద్దె కడుతున్న ఇంటి నుంచి రూ.800 అద్దె ఉన్న ఇంటికి మారాం. ఆర్థిక పరిస్థితి బాగోలేదని అర్థమైంది. ఇలాగైతే కష్టమని నేను దుబాయ్ వెళ్లి సంపాదిస్తానన్నాను. నాన్న ఒప్పుకోకపోయినా దుబాయ్ వెళ్లాను. అందుకు నాపై కోపంతో ఏడాదిన్నరపాటు మాట్లాడలేదు. అయినా అక్కడే రెండేండ్లు ఉండి ఇండియాకు వచ్చేశా.. అమ్మకోసమైనా ఉండిపోరా అన్నాడు.

అందుకే పనిమనిషికి ఆస్తి
మళ్లీ రూ.2500 అద్దె ఉన్న పాత అపార్ట్‌మెంట్‌కు షిఫ్ట్ అయ్యాము. మీనాక్షి మా పనిమనిషి. అమ్మను బాగా చూసుకునేది. అమ్మ చనిపోయాక నాన్నను మాతో పాటు రమ్మన్నాం. కానీ నాన్న ప్రైవసీ కావాలన్నారు. స్వేచ్ఛగా జీవించాలనుకున్నారు. ఆయనకు అడ్డు చెప్పలేకపోయాం. మీనాక్షి.. తనకు ఇల్లు కావాలని అడిగిందని విన్నాను. అందుకే నాన్న చనిపోయేముందు ఆమె కోసం కొంత ఆస్తి రాసిచ్చి పోయాడు. ఏదేమైనా మా అమ్మానాన్న కోసం చాలా సేవ చేశావని మీనాక్షి కాళ్లపై పడి దండం పెట్టుకున్నాను.
పదోసారి ప్రాణం పోయింది
నేను కట్టుకున్న భార్య గతేడాది చనిపోయింది. ఆమె మనసు స్థిమితంగా ఉండదు. తొమ్మిదిసార్లు చనిపోయేందుకు ప్రయత్నించింది. ప్రతిచిన్నదానికి ఎక్కువ భయపడి, బెదిరిపోయి ట్యాబ్లెట్లు మింగేది. పదోసారి అలాగే చేసింది. కానీ, ఈసారి డోసు ఎక్కువయ్యేసరికి చనిపోయింది. నా భార్య చనిపోయినప్పుడు ఎవరూ రాలేదు. అప్పుడే బంధుత్వాలను తెంచేసుకున్నా.. నా కొడుకుతో బతుకున్నాను. నాన్న ఎడమచేతికి తెలియకుండా కుడిచేత్తో దానధర్మాలు చేసేవాడు. ఆయన సంపాదించిందంతా ఆయనే ఖర్చు చేశారు. మాకేమీ ఇవ్వలేదు' అని నాగేంద్ర కుమార్ చెప్పుకొచ్చాడు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com