ఊహించని సర్‌ప్రైజ్. ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఫ్లాప్ అయింది. అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ ఆటు సరైన టాక్ తెచ్చుకోక.. కలెక్షన్స్ కూడా తెచ్చుకోలేక ఫెయిలైంది. దీంతో నెలలోపే స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఆషికా సినిమా)
పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన కమర్షియల్ మూవీ ఇది. హారర్ ఫాంటసీ కథతో దర్శకుడు మారుతి ఈ సినిమా తీశాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లు కాగా సంజయ్ దత్, జరీనా వహాబ్ లాంటి సీనియర్లు ఇందులో కీలక పాత్రలు చేశారు. కంటెంట్ మరీ తీసికట్టుగా అర్థం కాని విధంగా ఉండటంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. హిందీకి మరికాస్త సమయం పట్టొచ్చు.
'రాజాసాబ్' విషయానికొస్తే.. దేవనగర సంస్థాన ఒకప్పటి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్).. ప్రస్తుతం తన మనవడు రాజు(ప్రభాస్)తో చాలా సాధారణ జీవితం గడుపుతుంటుంది. వయసు కారణంగా ఈమెకు మతిమరుపు సమస్య ఉంటుంది. కానీ తన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తన కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా తీసుకురమ్మని మనవడికి చెబుతుంది. కానీ కనకరాజు.. రాజుని నర్సాపుర్‌లోని రాజ మహల్‌కి రప్పించుకుంటాడు. మార్మిక విద్యలెన్నో తెలిసిన కనకరాజుని రాజు అలియాస్ రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? కనకరాజు గతమేమిటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం)


