అమిగోస్, నా సామిరంగ, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర సినిమాలతో హీరోయిన్‌గా తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఆషికా రంగనాథ్. స్వతహాగా ఈమె కన్నడ అమ్మాయి. అక్కడ చాలానే మూవీస్ చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఈ నెల ప్రారంభంలోనే సొంత భాషా చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. దాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడా సినిమా ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్)
గత జన్మల ప్రేమకథ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెలుగులో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'గత వైభవం'. జనవరి 1న తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. కానీ కంటెంట్ పరంగా మరీ తీసికట్టుగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఇప్పుడీ మూవీ సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో ఆషికా, దుష్యంత్ ప్రధాన పాత్రలు చేయగా.. సునీ దర్శకత్వం వహించారు.
'గత వైభవం' విషయానికొస్తే.. ఆధునిక(ఆషికా రంగనాథ్)కి పెయింటింగ్స్ వేయడం అలవాటు. తన ఊహల్లో వచ్చే ఓ వ్యక్తి చిత్రాన్ని గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సరిగ్గా అదే పోలికలతో ఉన్న పురాతన్ (దుష్యంత్) ఈమెకు ఎదురుపడతాడు. విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో నడిపే పురాతన్.. తొలుత ఆధునికకు తప్పుడు ఉద్దేశంతో దగ్గరవ్వాలని చూస్తాడు గానీ తన గత జన్మల గురించి ఆమె చెప్పే నిజాలు ఇతడిని షాక్‌కి గురిచేస్తాయి. ఆధునికకు అసలు గత జన్మల గురించి ఎలా తెలుసు? వందల ఏళ్లక్రితం వీళ్లిద్దరి మధ్య బంధమేంటి? అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం)


