కథానాయకుడు, కథా రచయిత, గీత రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు ముఖాలు కలిగిన నటుడు ధనుష్. టాలీవుడ్ నుంచి, హాలీవుడ్ వరకు తన సినీ సామ్రాజ్యాన్ని విజయవంతంగా విస్తరించుకుంటూ పోతున్న ఈ మల్టీటాలెంట్ స్టార్ ఒక పక్క హీరోగా నటిస్తునే మరో పక్క దర్శకుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ధనుష్ తన 55వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి అమరన్ చిత్రం ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది.

ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ప్రేమించుకుని పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సుమారు 17 ఏళ్ల తర్వాత మనస్పర్థలు కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఇటీవలే విడాకులు కూడా పొందారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందులో పెద్దవాడి పేరు యాత్ర ఇతన్ని ఇప్పుడు ధనుష్ కథానాయకుడిగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.
మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు ధనుష్ నే దర్శకత్వం వహించడంతో పాటూ తన వండర్ బార్ పతాకంపై నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే నిజం అయితే, ధనుష్ కుమారుడికి మంచి ఎంట్రీనే దొరుకుతుంది. తన తాతయ్య రజనీకాంత్ ఇమేజ్ కూడా యాత్రకు కలిసొస్తుంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు అన్నది గమనార్హం.


