బస్ కండ్టర్ నుంచి సినీ సూపర్ స్టార్‌గా ఎదగడం వరకూ రజనీకాంత్ జీవితంలో ఎన్నో కష్టాలు... మలుపులు. అందుకే ఆయన జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులు ఈ హీరో బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సిల్వర్ స్క్రీన్‌పైకి సూపర్ స్టార్ లైఫ్ ఎప్పుడు వస్తుందో కానీ ప్రస్తుతానికి అయితే ఆయన జీవితం పుస్తక రూపంలో రానుందని రజనీ రెండో కుమార్తె, దర్శక–నిర్మాత సౌందర్య రజనీకాంత్ పేర్కొన్నారు.
ఆమె నిర్మించిన ‘విత్ లవ్’ అనే చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి ఆటోబయోగ్రఫీ గురించి మాట్లాడారు సౌందర్య. ‘‘మా నాన్న తన జీవిత విశేషాలతో ‘ఆటోబయోగ్రఫీ’ రాస్తున్నారు. కర్ణాటకలో బస్ కండక్టర్‌గా ఆరంభించి, కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా ఎదిగిన వరకూ మా నాన్న జీవితంలో ఎన్నో కష్టాలు, మలుపులున్నాయి.
ఎవరికీ తెలియని విశేషాలన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి. మా నాన్న స్వీయచరిత్ర సంచలనం అవుతుంది’’ అని పేర్కొన్నారు సౌందర్య. కాగా... పుస్తకం మాత్రమే కాదు... రజనీ జీవితంతో సినిమా నిర్మించే ప్లాన్‌లో సౌందర్య ఉన్నారు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతుందని ఆమె ఆ ఇంట ర్వ్యూలో పేర్కొన్నట్లు తెలిసింది.


