అవి 1980, 1990 రోజులు.. అప్పటి మద్రాసులో కోదండపాణి, ప్రసాద్, ఎ.వి.యం., విజయ రికార్డింగ్ స్టూడియోలు ఉండేవి.. అన్నిచోట్ల రోజుకు రెండు చొప్ప్పున పాటలు రికార్డ్ అయ్యేవి.. సినిమాలు వేరే, నిర్మాతలు వేరే, సంగీత దర్శకులు వేరే, కానీ పాటల రచయిత మాత్రం ఒకే ఒక్కరు.. ఆయనే వేటూరి సుందరరామమూర్తి..!
తెలుగు సినిమా పాట... ‘వేటూరికి ముందు, వేటూరికి తర్వాత’ అనొచ్చేమో. ఏమో ఏంటీ అనొచ్చు, అనాలి..! మనకు ఎందరో మహా రచయితలు ఉన్నారు. ఆ మహానుభావులు అందరూ కలిసి, ఒక్కరైతే... ఆ ఒక్కరే వేటూరి సుందరరామమూర్తి..!
అవునండీ..! వేటూరి వారు రాకముందు.. ఒక్కోరకం పాటకు ఒక్కో రచయితను వెతుక్కునేవారు దర్శక`నిర్మాతలు.. వేటూరి వారు వచ్చాక, అన్ని పాత్రలకూ, అన్ని సందర్భాలకూ.. అన్ని పాటలకూ ఒక్కరే రచయిత. ఆయనే వేటూరి వారు..!
మరో విషయం కూడా ఇక్కడ చెప్ప్పుకోవాలి.. వేటూరి రాకముందు పాటల విషయంలో తెలుగు సినిమా ఒక ఇబ్బందిలో ఉండేది.. అద్భుతమైన పాటలే గానీ, బాగా ఆలస్యం అవుతూ ఉండేవి.. పాటల రికార్డింగ్ కోసం పడిగాపులు కాసే పరిస్థితి.. అలాంటి రోజుల్లో, ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు వేటూరి.
అనాయాసంగా అత్యుత్తమస్థాయి సాహిత్యాన్ని అందించారు.
మూడు అక్షరాల ‘వేటూరి... మూడు తరాల తెలుగు పాటకు ‘భరోసా’ అయ్యారు ‘ఎంత ఎదిగిన బిడ్డ అయినా, తండ్రి ముందు ఒదిగే వుండాలి’ అన్న నానుడి నిజం చేస్తూ... తన ముందు తరం మహా రచయితలను ఎంతగానో గౌరవించేవారు, వినమ్రతతో వ్యవహరించేవారు.
వేటూరి వారు...
వెండితెర విశారదుడు.
తెలుగు పాటల తాంత్రికుడు.
పాటను శ్వాసించాడు.
పాటల ప్రపంచంలో
ఆయనది ఒక అధ్యాయం
ఒక శకం, ఒక యుగం
ఒక ఇతిహాసం..!
గత వైభవానికి వారధి..!
భావి ప్రాభవానికి సారధి..!
ముందు తరాలకు వేటూరి...
ఒక విభ్రమం..! ఒక దిగ్భమం..!!
రాబోయే రోజుల్లో ప్రేక్షకులు...ఒకప్ప్పుడు వేటూరి అనే ఒక పాటల రచయిత ఉండేవారట.. ఆశువుగా పాటలు చెప్పేవాడట.. విజయాగార్డెన్ చెట్టు కింద, విమానంలో టిష్యూ పేపర్ మీద, ఆటోలో తిరుగుతూ, హాస్పిటల్‌లో దాక్కుని, మెరీనా బీచ్‌లో, గుర్రాల పందాల దగ్గర, ఇక్కడ అక్కడ, అయిన చోట, కాని చోట, అన్ని చోట్లా, అన్ని వేళలా, అనితరసాధ్యమైన, అజరామరమైన పాటలు అలవోకగా రాసేవాడట..! అని కథలు కథలుగా వేటూరి గురించి విడ్డూరంగా చెప్ప్పుకుంటారు. ప్రతిరోజూ, ప్రతి నిమిషం వేటూరి పాటలు వినపడుతూనే వుంటాయి.
‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.
మహాపురుషులు అవుతారు..’
అని రాసారు ఆయన..!
ఆ కషి, ఆ ఋషి, ఆ మహాపురుషుడు...
వేటూరి సుందరరామమూర్తి..!
మనసా స్మరామి..!!
శిరసా నమామి..!!
-పైడిపాటి రాజేంద్రకుమార్
ప్రముఖ సినిమా రచయిత


