
బిగ్‌బాస్ షో మరో రెండు వారాల్లో మొదలవుతుంది. ఈసారి సామాన్యులకు ఎక్కువమందికి అవకాశం కల్పించేందుకు అగ్నిపరీక్ష పేరుతో ఓ షో ప్లాన్ చేశారు. గత నాలుగైదు రోజుల నుంచి పలు గేమ్స్ పెడుతూ టాప్-15 కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేశారు. అయితే సోమవారం ఎపిసోడ్‌లో ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్.. ఓ లేడీ కంటెస్టెంట్‌పై మాట తూలాడు. ఈ విషయమై విమర్శలు రావడంతో ఇప్పుడు క్షమాపణ చెప్పుకొచ్చాడు.
సోమవారం టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్‌లో కల్కి, షాకీబ్ అనే కంటెస్టెంట్స్ మధ్య చిన్న గేమ్ పెట్టారు. ఎవరికైనా ఫోన్ చేసి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు వేయమని చెప్పారు. అయితే ఈ పోటీలో కల్కికి గేమ్ గురించి క్లియర్‌గా చెప్పారు. షాకీబ్‌కి మాత్రం సరిగా వివరించలేదు. దీంతో అతడికి తక్కువ డబ్బులు మాత్రమే పడ్డాయి. ఇది ఎవరికైనా అన్ ఫెయిర్ అనిపించిందా? అని కూర్చున్న కంటెస్టెంట్స్‌ని నవదీప్ అడగ్గా.. శ్రీజ చేయి ఎత్తింది.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో హాలీవుడ్ పవర్ హౌస్.. బిగ్ ప్లాన్ రెడీ)
దీంతో శ్రీజని నవదీప్ స్టేజీపై రమ్మన్నాడు. అన్ ఫెయిర్ అని ఎందుకు అనిపించింది? అని ఈమెని అడగ్గా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గెలుస్తారని కల్కికి వివరంగా చెప్పారు, కానీ, అతడికి ఆ మాట చెప్పలేదని ధైర్యంగా అనేసింది. దాంతో నవదీప్ కోప్పడ్డాడు. నువ్వు అతిగా ఆలోచించొద్దు. బిగ్‌బాస్ అనేది చాలా భాషల్లో ఎన్నో సీజన్లు జరిగాయి. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్‌ఫెయిర్ అని చెప్పడానికి.. నీకంత సీన్ లేదు. ఇంకోసారి ఇలా చేయకు అంటూ ఆమెను చులకన చేసి మాట్లాడాడు.
అయితే 'ఊరి నుంచి వచ్చావ్' అని నవదీప్ కామెంట్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఇప్పుడు తన ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు. ''ఊరి నుంచి వచ్చి' అన్న మాటకు ఫీలైన సున్నితమైన మనసులకు ప్రేమలో సారీ చెబుతున్నా. కుదిరితే క్షమించండి. ఐ లవ్యూ' అని నవదీప్ రాసుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్’లో ప్రేమాయణం.. పెళ్లి చేసుకున్న జంటలివే)
