
బుల్లితెరపై ‘బిగ్‌బాస్’రియాల్టీ షోకి ఎంత పాపులారిటీ ఉందో అందరికి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాకుండా అంతటా ఈ షోకి మంచి ఆదరణ ఉంది. ఇక హిందీలో అయితే ఇప్పటికే 18 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా 19వ సీజన్ కూడా అట్టహాసంగా ప్రారంభం అయింది. మనుషుల ఎమోషన్‌తో సాగే ఈ షో.. కొంతమందికి జీవిత భాగస్వాములను కూడా వెతికిపెట్టింది. ఈ షోలో పాల్గొని, ప్రేమలో పడి..పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ‘బిగ్‌బాస్’కలిపిన జంటలపై ఓ లుక్కేద్దాం.

సారా ఖాన్- అలీ మర్చంట్
బిగ్‌బాస్ షో ద్వారా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తొలి జంట సారా ఖాన్, అలీ మర్చంట్. హిందీ బిగ్‌బాస్ 4లో పాల్గొన్న వీరిద్దరు.. షోలో ఉన్నప్పుడే ప్రేమలో పడి వివాహం(2010లో) చేసుకున్నారు. అయితే, వీరి ప్రేమ కథ సుఖాంతం కాలేదు. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అలీ 2016లో అనమ్ మర్చంట్‌ను వివాహామాడారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2021లో విడిపోయారు. కొన్నాళ్ల తర్వాత తన ఫ్రెండ్ ఆండ్లీబ్ జైదీని మూడో పెళ్లి చేసుకున్నారు.

మోనాలిసా- విక్రాంత్ సింగ్ రాజ్‌పూత్
భోజ్‌పురి హీరోయిన్ మోనాలిసా (అంతరా బిస్వాస్) బిగ్‌బాస్ 10లో పాల్గొన్నప్పుడు, ఆమె బాయ్‌ఫ్రెండ్ విక్రాంత్ సింగ్ రాజ్‌పూత్ షోలో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి, జాతీయ టెలివిజన్‌లో ఆమెకు ప్రపోజ్ చేశారు. ఆ క్షణం అభిమానులకు ఎమోషనల్ మూమెంట్‌గా నిలిచింది. 2017లో వీరు బిగ్‌బాస్ హౌస్‌లోనే వివాహం చేసుకున్నారు, ఇది షో చరిత్రలో అరుదైన సంఘటన. తర్వాత వారు సాంప్రదాయ వివాహ వేడుకను కూడా జరుపుకున్నారు. వీరి బంధం ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది.

యువికా చౌదరి-ప్రిన్స్ నరులా
హిందీ బిగ్‌బాస్ 9లో పాల్గొన్న ప్రిన్స్ నరులా, యువికా చౌదరితో స్నేహంగా మొదలైన బంధం క్రమంగా ప్రేమగా మారింది. షోలో ప్రిన్స్ యువికా కోసం హార్ట్ ఆకారంలో చపాతీ చేసి ప్రపోజ్ చేసిన సన్నివేశం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కొందరు దీన్ని గేమ్ స్ట్రాటజీ అనుకున్నప్పటికీ, షో తర్వాత వీరి ప్రేమ నిజమని నిరూపితమైంది. 2018 అక్టోబర్ 12న వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. యువికా ప్రిన్స్ కంటే ఏడేళ్లు పెద్దవారైనప్పటికీ, వారి బంధం అభిమానులకు స్ఫూర్తిగా నిలిచింది.

సుయాష్ రాయ్-కిష్వర్ మర్చంట్
సుయాష్ రాయ్-కిష్వర్ మర్చంట్ బిగ్‌బాస్ 9లో పాల్గొన్నారు. వీరు 2011 నుంచి డేటింగ్‌లో ఉన్నప్పటికీ, షోలో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, షో ఒత్తిడిలో కూడా వారి బంధం బలపడింది. 2016లో వీరు సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. 2021లో వీరికి నిర్వైర్ అనే కుమారుడు జన్మించాడు.

పాయల్ రోహత్గీ- సంగ్రామ్ సింగ్
బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ, రెజ్లర్ సంగ్రామ్ సింగ్ బిగ్‌బాస్ 7లో కలుసుకున్నారు. వీరి సంబంధం షో తర్వాత కూడా కొనసాగింది, దాదాపు 12 ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు.2022 జులై 9న ఆగ్రాలో వీరు వివాహం చేసుకున్నారు.