
హీరోయిన్‌గా ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నారు సమంత. ఆమె నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’. హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్య తారలుగా నటించారు. ఈ చిత్రంలో సమంత కూడా నటించారు. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత నిర్మించిన ‘శుభం’ ఈ నెల 9న రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా మొదటి సింగిల్ ‘జన్మ జన్మల బంధం...’ అనే పాటని శనివారం విడుదల చేశారు. ‘‘ఇది ప్రమోషనల్ వైబ్ కోసం రూపొందించిన ఓ ఎనర్జిటిక్ రీమిక్స్ పాట. ఈ సాంగ్‌లో సమంతతో పాటు ప్రధాన తారాగణం కనిపిస్తారు. ఈ ప్రమోషనల్ సాంగ్ బీట్ చాలా హుషారుగా ఉంటుంది. నవ్వు, భయం.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్తో ‘శుభం’ రూపొందింది. ఈ వేసవికి ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరిచే చిత్రం అవుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: వివేక్ సాగర్, సంగీతం: క్లింటన్ సెరెజో.