డబ్బు కోసం వ్యాపారిని బెదిరించిన సల్మాన్‌ ఖాన్‌ మాజీ బాడీగార్డ్‌

 Salman Khan Former Bodyguard Who Threatened The Businessman For Money - Sakshi

గతంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన నిందితుడు షేరు అలియాస్‌ షేరా ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని ఓ వ్యాపారి నుంచి 10 లక్షలు డిమాండ్ చేశాడు. కరేలి పోలీసులు అతనిపై హత్యాయత్నం, బెదిరింపులతో సహా తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్, కండలవీరుడు అతిక్ అహ్మద్‌లకు తాను సన్నిహితుడినని నిందితుడు గతంలో పేర్కొన్నాడు.సల్మాన్ ఖాన్‌ను బెదిరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. కస్టడీ నుంచి విడుదలైన తర్వాత, అతను మళ్లీ ప్రయాగ్‌రాజ్‌లోని ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు డిమాండ్ చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

రెండేళ్ల నుంచి బెదిరింపులు
ప్రయాగ్‌రాజ్‌ నివాసి, వ్యాపారి జిషాన్‌ జకీర్‌ తనకు రెండేళ్లుగా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని కరేలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నగర డీసీపీ దీపక్‌ భుకర్‌ తెలిపారు. షేరా ఒక నేరస్థుడిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నవంబర్ 10న తన ముగ్గురు సహచరులతో వచ్చి కాల్చి చంపే ప్రయత్నం చేశాడు. దీని నుంచి తృటిలో తప్పించుకున్నాను. తర్వాత షేరా తన సహచరులతో కలిసి నన్ను కొట్టి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు
పోలీసుల కథనం ప్రకారం, కొన్నేళ్ల క్రితం నటుడు సల్మాన్ ఖాన్ వద్ద షేరా సెక్యూరిటీ సిబ్బందిలో ఉండేవాడు. అతడి ప్రవర్తన సరిగా లేనందున అతన్ని ఉద్యోగం నుంచి సల్మాన్‌ తొలగించారు. 2018లో తనకు సినిమాలో అవకాశం ఇవ్వాలని నటుడిని డిమాండ్ చేశాడు. అందుకు సల్మాన్‌ నిరాకరించడంతో ఆయన మొబైల్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. ఆ సమయంలో షేరా ముంబైలో ఉండేవాడు. సల్మాన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు అతడిని జైలుకు పంపారు.

షేరా జైలు నుంచి బయటకు వచ్చి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నివశించాడు. రెండేళ్ల క్రితం జిషాన్ జకీర్ అనే వ్యాపారికి షేరా ఫోన్ చేసి బెదిరించాడు. డబ్బులు డిమాండ్‌ చేశాడు. అడిగినంత ఇవ్వకుంటే ఇంట్లో బాంబు పెట్టి పేలుస్తానని బెదిరించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నిందితుడు షేరాపై ప్రయాగ్‌రాజ్‌లోని వివిధ స్టేషన్లలో మొత్తం 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు వల పన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top