నటుడు ఆది సాయికుమార్ ఖాతాలో 'శంబాల' సినిమాతో హిట్ పడింది. సరైన విజయం కోసం ఆయన చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే శంబాల సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాడు. బక్సాఫీస్ వద్ద సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ హిందీలో కూడా విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.
తెలుగులో క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదలైన శంబాల చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ చిత్రాలకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉండటంతో జనవరి 1న హిందీ వర్షన్ విడుదల చేస్తున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సరైన ప్రచార వ్యూహంతో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తే హిందీ బెల్ట్లో ఇలాంటి కంటెంట్కు మంచి డిమాండ్ ఉంది. అయితే, నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎంత దూకుడుగా ప్రమోట్ చేస్తారో చూడాలి. శంబాల పార్ట్ -2 ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది.

శంబాల చిత్రాన్ని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఇందులో అర్చన అయ్యర్, స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. అయితే, దర్శకుడు చాలా అద్భుతంగా సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. సినిమా బాగుందని రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ విషయంలో దూకుడు చూపించడం లేదు.


