భాయ్‌... బాబా... ఓ అంతర్జాతీయ చిత్రం | Salman Khan And Sanjay Dutt Shine In Saudi Action Comedy The Seven Dogs, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

భాయ్‌... బాబా... ఓ అంతర్జాతీయ చిత్రం

Jun 7 2025 12:04 AM | Updated on Jun 7 2025 11:31 AM

Salman Khan and Sanjay Dutt shine in Saudi action comedy The Seven Dogs

సౌదీ అరేబియన్‌ మూవీ ‘7 డాగ్స్‌’లో అతిథి పాత్రల్లో బాలీవుడ్‌ స్టార్స్‌

‘‘అదిరింది టీజర్‌... సల్మాన్‌ భాయ్‌ భలే ఉన్నాడు... సంజూ బాబా కూడా బాగున్నాడు’’ అంటూ సల్మాన్‌ ఖాన్, సంజయ్‌ దత్‌ల అభిమానులు ఆనందపడిపోతున్నారు. శుక్రవారం విడుదలైన సౌదీ అరేబియన్‌ మూవీ ‘7 డాగ్స్‌’ టీజర్‌లో సల్మాన్, సంజయ్‌ల లుక్స్‌ని ఇలా ప్రశంసించారు. ఈ బాలీవుడ్‌ స్టార్స్‌ ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి అంతర్జాతీయ చిత్రం ఇది.

ఈ చిత్రానికి అదిల్‌ ఎల్‌ అరబీ, బిలాల్‌ ఫల్లాహ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అరబ్‌ స్టార్స్‌ కరీం అబ్దెల్‌ అజీజ్, అహ్మద్‌ ఎజ్‌ లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఇంటర్నేషనల్‌ క్రైమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సల్మాన్, సంజయ్‌ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. టీజర్‌లో ఇద్దరి పాత్రల గురించిన విశేషాలను బయటపెట్టలేదు. సల్మాన్‌ విచిత్రమైన చూపులు చూస్తుండగా, తుపాకీ గురి పెట్టి, కోపంగా కనిపించారు సంజయ్‌ దత్‌.

కథేంటంటే...  వార్తల్లో ఉన్న ప్రకారం... ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ ఖలీద్‌ అల్‌ అజ్జాజీ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. రహస్య ప్రపంచ నేరాల సిండికేట్‌ అయిన ‘7 డాగ్స్‌’లోని ఉన్నత స్థాయి సభ్యుడు ఘాలీ అబు దావూద్‌ను ఈ అధికారి పట్టుకుంటాడు. ఓ ఏడాది తర్వాత ఆ సంస్థ తిరిగి పుంజుకుంటుంది. పింక్‌ లేడీ అనే కొత్త డ్రగ్‌ను రవాణా చేయడం ప్రారంభిస్తుంది. ఈ ముఠా గుట్టుని రట్టు చేయడానికి ఖలీద్‌ అయిష్టంగానే ఘాలీతో చేతులు కలుపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే కథ అని సమాచారం. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement