Oscars 2021: ఆమెకు ఆస్కార్‌

Sakshi Special Story About Oscar Awards 2021

మరక మాయం చేసే ప్రయత్నం

నటుడు బోస్మాన్‌ ఫ్యాన్స్‌కి నిరాశ

ఆస్కార్‌ పెద్దల మనసు మారిందా?
మనసు ‘తెల్లని’ కాగితం అయిందా?
అందుకే ‘నల్ల’ ప్రతిభను గుర్తించిందా?... 93వ ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో నల్ల జాతీయులకు అవార్డులు దక్కడంతో చాలామంది మదిలో మెదిలిన ప్రశ్నలివి. 93 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో రెండోసారి ఓ మహిళకు బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డు దక్కింది. ఈసారి ఎక్కువమంది మహిళలకు అవార్డు దక్కడం కూడా ఓ విశేషం. రంగుకి, లింగ భేదానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రతిభకు అవార్డు ఇచ్చినట్లు అనిపించిందన్నది పలువురి అభిప్రాయం. ‘ఆమె’ ఆస్కార్‌తో మెరిసిన వేళ... నల్ల జాతీయులు మురిసిన వేళ.... అవార్డు వేడుక విశేషాలు తెలుసుకుందాం.

‘ఆస్కార్‌ అంటే తెల్ల జాతీయులదే... నల్ల జాతీయులకు చోటు ఉండదు’ అనే విమర్శ దాదాపు ఐదేళ్లుగా ‘అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ మోస్తూ వస్తోంది. అయితే ఈ ‘రంగు మరక’ను తుడిచేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈసారి ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసినట్లు కనబడుతోంది. ఇందుకు ఓ ఉదాహరణ నల్ల జాతీయులంతా కలిసి నిర్మించిన ‘నొమాడ్‌ ల్యాండ్‌’ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం. ఈ సినిమా వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఉత్తమ దర్శకుడు, నటుడు, నటీమణి.. ఇలా మూడు ప్రధాన విభాగాల్లో అవార్డు దక్కించుకోవడం విశేషం.

పది నామినేషన్లు దక్కించుకున్న ‘మాంక్‌’ కేవలం రెండు అవార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది. ఆరు నామినేషన్లు దక్కించుకున్న ‘నొమాడ్‌ ల్యాండ్‌’ మూడు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రానికిగాను ఉత్తమ దర్శకురాలిగా ఎంపికయ్యారు క్లో జావ్‌ (39). దర్శకుల విభాగంలో అవార్డు అందుకున్న రెండో మహిళ, తొలి ఆసియన్‌ మహిళ కూడా క్లో జావే కావడం విశేషం. ఇదే చిత్రానికిగాను 63ఏళ్ల మెక్‌ డోర్మాండ్‌ను  ఉత్తమ నటి అవార్డు వరించింది.

మూడు ఆస్కార్‌లు గెల్చుకున్న ఏడో నటి డోర్మాండ్‌ కావడం విశేషం. మరోవైపు ‘మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌’ చిత్రానికి  గాను హెయిర్‌ స్టయిలింగ్, మేకప్‌ విభాగంలో తొలిసారి నామినేషన్‌ పొందిన ఇద్దరు నల్లజాతి మహిళలు మియా నీల్, జామికా విల్సన్‌లు అవార్డుని కూడా ఇంటికి తీసుకెళ్లగలిగారు. అలాగే ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిలిం అవార్డుని కొట్టేసింది ‘సోల్‌’. ‘బ్లాక్‌’ క్యారెక్టర్‌ లీడ్‌గా సాగిన చిత్రం ఇది. అది మాత్రమే కాదు.. ఉత్తమ సహాయ నటిగా అవార్డు దక్కించుకున్నారు కొరియన్‌ నటి జంగ్‌ యూన్‌. ‘మినారీ’ చిత్రంలోని నటనకుగాను ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఆస్కార్‌ అందుకున్న తొలి కొరియన్‌ నటి ఆమే.

ఈసారి అవార్డుల ఎంపిక పరంగా పెద్దగా విమర్శలు రాలేదు కానీ, ఉత్తమ నటుడి ఎంపిక విషయంలో కొందరు అసంతృప్తి వ్యక్తపరిచారు. ‘మా రేనీస్‌ బ్లాక్‌ బాటమ్‌’ చిత్రంలోని నటనకు గాను దివంగత నటుడు చాడ్విక్‌ బోస్మాన్‌కు ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని చాలామంది ఊహించారు కానీ నిరాశే ఎదురైంది. ‘ది ఫాదర్‌’కి ఆంథోనీ హాప్కిన్స్‌ ఉత్తమ నటుడి అవార్డు పొందారు. 93 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో 80ఏళ్ల వయసు పైబడిన ఇద్దరు తారలకు అవార్డులు దక్కిన ఆనందం ఈసారే జరిగింది. ఉత్తమ నటుడిగా ఆంథోనీ హాప్కిన్స్‌ (83), కాస్ట్యూమ్స్‌ డిజైనింగ్‌ విభాగంలో అన్‌ రోత్‌ అనే 89 ఏళ్ల మహిళకు ఆస్కార్‌ దక్కింది. ఈసారి మరో విశేషం కూడా జరిగింది. మామూలుగా మహిళలకు అంటూ ఉండే విభాగాలు రెండో.. మూడో.

ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి... ఇలా. మిగతా విభాగాల్లో పురుషాధిక్యం ఉంటుంది. ఆ విభాగాల్లోనూ మహిళలు అవార్డు దక్కించుకోవడం అంటే చాలా పెద్ద విషయం. ఈసారి డైరెక్షన్, మేకప్, హెయిర్‌ స్టయిలింగ్, కాస్ట్యూమ్స్‌ డిజైనింగ్, ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే తదితర విభాగాల్లోనూ మహిళలు రాణించడం విశేషం. మొత్తం 15కి పైగా అవార్డులు అతివల సొంతమయ్యాయి. ఇక కోవిడ్‌ కారణంగా వీక్షకులను వేడుకకు అనుమ తించలేదు. ఎప్పుడూ ఒకే వేదిక మీద జరిగే ఆస్కార్‌ అవార్డు వేడుక  కోవిడ్‌ కారణంగా ఈసారి రెండు వేదికలు లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్, యూనియన్‌లో అవార్డు వేడుక జరిగింది.  

రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ ఎమెరాల్డ్‌ ఫెన్నల్‌ ‘ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమన్‌’ చిత్రానికిగాను బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్‌ అవార్డు సాధించారు. 13 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో అవార్డు సాధించిన మహిళ ఎమెరాల్డే కావడం విశేషం. 2008లో ‘జునో’ చిత్రానికి డాయాబ్లో కోడైకి అవార్డు దక్కింది.

‘గెట్‌ అవుట్‌’కి 2018లో ఆస్కార్‌కు నామినేట్‌ అయినా అవార్డును గెలుచుకోలేదు డేనియల్‌ కలుయా. ఈసారి ‘జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మెస్సయ్య’లోని నటనకుగాను ఉత్తమ సహాయ నటుడిగాæఆయన‡ఆస్కార్‌ అందుకున్నారు.

నాన్నతో కలిసి నేను చైనాలో పెరుగుతున్నప్పుడు సరదాగా ఓ ఆట ఆడేవాళ్ళం. చైనీస్‌లోని మంచి పద్యాలు, సామెతలను ఒకరికొకరం చెప్పుకునేవాళ్ళం. అయితే ఈ పద్యాల్లో ఒకరు ఒక వాక్యం చెబితే ఆ తర్వాతి వాక్యాన్ని మరొకరు చెప్పాలి. ఇదే గేమ్‌. నా చిన్నతనంలో ఇలా చాలాసార్లు ఆడుకున్నాం. వీటిలో ఒక వాక్యం ఉంది. ‘పుట్టినప్పుడు సహజంగానే అందరూ మంచివాళ్లే’. ఈ మాటలు నా చిన్నతనంలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. ఇప్పటికీ నేను దీన్ని నమ్ముతాను. అందుకే ప్రపంచంలో నేను ఏ మూల ఎవర్ని కలిసినా వారిలోని మంచిని గురించే ఆలోచిస్తాను. కేవలం ఇతరుల మంచినే కాదు.. మనలో దాగి ఉన్న మంచిని కూడా మనం ధైర్యంగా తెలుసుకుందాం.
– క్లో జావ్, ఉత్తమ దర్శకురాలు

నేను నా స్వస్థలమైన వేల్స్‌లో ఉన్నాను. నాకిప్పుడు 83 ఏళ్ళు. ఈ వయసులో నాకు ఆస్కార్‌ అవార్డు వస్తుందని ఊహించలేదు. సంతోషంగా ఉంది. చాలా గౌరవంగా భావిస్తున్నాను. అకాడెమీ సభ్యులకు నా ధన్యవాదాలు. చాడ్విక్‌ బోస్మాన్‌కు నా నివాళులు అర్పిస్తున్నాను. చాడ్విక్‌ చాలా తొందరగా మనల్ని విడిచి వెళ్లిపోయాడు.

– సర్‌ ఆంథోనీ హాప్కిన్స్, ఉత్తమ నటుడు

నా నోట మాటలు రావడం లేదు. చాలా సంతోషంగా ఉంది. నాకు నటన వచ్చని నమ్మి, అవకాశాలు ఇస్తున్నవారికి ధన్యవాదాలు.

– ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్మాండ్, ఉత్తమ నటి

అస్కార్‌ అవార్డుకి ఇప్పటికే ఎనిమిదిసార్లు నామినేట్‌ అయ్యారు గెన్‌ క్లోజ్‌. కానీ ఆమెకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేట్‌ అయిన గెన్‌ క్లోజ్‌కు అవార్డు దక్కలేదు. కేవలం ఒకేఒకసారి నామినేట్‌ అయిన జంగ్‌ యూన్‌కు అవార్డు రావడం ఆస్కార్‌ వేడుకలో మరో హైలైట్‌.

వయోలా డేవిస్, క్యారీ ముల్లిగన్, రెజీనా కింగ్, ఏంజెలా బాస్సెట్, హల్లే బెర్రీ వంటి తారలు రెడ్‌ కార్పెట్‌పై మెరిశారు. పొడవాటి గౌనుల్లో గ్లామర్‌గా కనిపించారు. ఖరీదు గల నగలతో నగుమోముతో వీక్షకులకు కనువిందు చేశారు.

ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో డెన్మార్క్‌కు చెందిన ‘అనదర్‌ రౌండ్‌’ చిత్రం ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. చిత్రదర్శకుడు థామస్‌ వింటర్‌బెర్గ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. వీక్షకుల కళ్లూ చెమర్చాయి. ‘‘జీవితాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలనే ఉద్దేశంతో మేం ఈ సినిమాను తీశాం. జీవితంలో కంట్రోల్‌ ఉండాలి. నా జీవితంలో నేను నా కూతురు ఇదాను కోల్పోయాను. ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించడానికి రెండు నెలల ముందు నా కూతురు ఇదా ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. తనకు ఈ సినిమా స్క్రిప్ట్‌ బాగా నచ్చింది. అందుకని తనతో ఈ సినిమాలో ఒక లీడ్‌ రోల్‌ చేయించాలనుకున్నాను. ఈ అవార్డు ఆమెదే’’ అని భావోద్వేగానికి లోనయ్యారు థామస్‌. అలాగే దాదాపు పదేళ్ల తర్వాత ఈ విభాగంలో డెన్మార్క్‌కు ఆస్కార్‌ అవార్డు రావడం విశేషం.

ఈసారి విశేషాలు ఇవీ...
∙‘మినారి’ చిత్రంలో ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ సాధించారు కొరియన్‌ మహిళ జంగ్‌ యూన్‌. ఆ ఘనత సాధించిన తొలి కొరియన్‌ మహిళ ఆమె. నామినేట్‌ అయిన తొలిసారే జంగ్‌ యూన్‌ను అవార్డు వరించడం మరో విశేషం.
∙‘నొమాడ్‌ ల్యాండ్‌’ సినిమా తర్వాత క్లో జావ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎటర్నల్‌’.  ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఆస్కార్‌ అవార్డు వేడుకలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అలాగే స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలోని ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీ’ టీజర్‌ను విడుదల చేశారు.

‘సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ చిత్రానికి నామినేట్‌ అయిన రిజ్‌ అహ్మద్‌కు అవార్డు వచ్చినట్లయితే ...ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న తొలి ముస్లింగా రిజ్‌ అహ్మద్‌ చరిత్ర సృష్టించేవారు. అయితే నామినేషన్‌ దక్కించుకోవడం అంటే కూడా చిన్న విషయం కాదు. అవార్డు రాకపోయినా ఈ ఆస్కార్‌ వేడుకలో తన భార్య హెయిర్‌ను సరిచేస్తూ ఆకట్టుకున్నారు రిజ్‌. ఆ ఫోటోలు నెట్టింట్లో  వైరల్‌ అవుతున్నాయి.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌ను క్లోజ్‌ చేశారు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలకు కూడా ఈసారి ఆస్కార్‌ అవార్డ్స్‌లో చోటు దక్కింది.  మా రేనీస్‌ బ్లాక్‌ బాటమ్‌ (2), మాంక్‌ (2), అక్టోపస్‌ టీచర్‌ (1), ఇఫ్‌ ఎనీథింగ్‌ హ్యాపెన్స్‌ ఐ లవ్‌ యూ (1), టు డిస్టంట్‌ స్ట్రేంజర్స్‌ (1) .. ఇలా నెట్‌ఫ్లిక్స్‌లోని చిత్రాలకు ఏడు అవార్డులు, అమెజాన్‌ ప్రైమ్‌లోని ‘సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌’ చిత్రానికి (2), డిస్నీ ఫ్లస్‌లోని ‘సోల్‌’కు (2).. ఇక మరో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ హులులోని ‘నొమాడ్‌ ల్యాండ్‌’కు (3).. ఇలా మొత్తం 23 ఆస్కార్‌ విభాగాల్లో 14 అవార్డులు ఓటీటీలో స్ట్రీమ్‌ అయిన చిత్రాలు దక్కించుకోవడం విశేషం.

మన దేశం తరపున ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఆస్కార్‌ ఎంట్రీగా వెళ్లింది. కానీ నామినేషన్‌ దక్కించుకోలేకపోయింది. ఇక ప్రియాంకా చోప్రా నటించిన ‘వైట్‌ టైగర్‌’ ఎడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకున్నప్పటికీ అవార్డును అందుకోలేకపోయింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top