నటుడు రజనీకాంత్ హీరోగా నటించనున్న నూతన చిత్రంలో నటి సాయిపల్లవి నటించనున్నారా..? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉంది అంటూ కోలీవుడ్ వర్గాల నుంచి సమాధానం వస్తుంది. రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ –2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి కమలహాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో నటుడు రజనీకాంత్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శిబి చక్రవర్తి తెరకెక్కించనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించే ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుందని సమాచారం.
కాగా ఇందులో నటించే ఇతర తారాగణం గురించిన వివరాలు ఇంకా వెలువడకున్నా, ముఖ్య పాత్రలో నటి సాయిపల్లవిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య నటుడు కమలహాసన్ నిర్మించిన అమరన్ చిత్రంలో సాయిపల్లవి కథానాయకిగా నటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈమె హిందీలో ఏక్ ధిన్, రామాయణ 1,2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించనున్న 173వ చిత్రంలో సాయిపల్లవి నటించనున్నారనే ప్రచారం హోరెత్తుతోంది.

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. కాగా నటుడెవరైనా, దర్శకుడెవరైనా తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటి సాయిపల్లవి నటించడానికి అంగీకరిస్తారన్నది తెలిసిందే. దీంతో ఈమె రజనీకాంత్ చిత్రంలో నటించడానికి సై అంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రంలో నటి శృతీహాసన్ ముఖ్య పాత్రలో నటించడం గమనార్హం. రజనీ సినిమాలో సాయిపల్లవి పాత్ర బలంగా ఉంటే తప్పకుండా చేస్తుందని ఆమె అభిమానులు చెబుతున్నారు. గతంలో తనకు చిరంజీవి సినిమా ఛాన్స్ వచ్చినా సరే రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.


