తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది యువ కథానాయిక రితికా నాయక్. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘మిరాయ్’ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. నేడు పుట్టినరోజు నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరో ఎవరో చెప్పిన రితికా.. తనను పెళ్లి చేసుకునే వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా వెల్లడించింది. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలో సీఎం విజయ్ కొడుకు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
అందంగా ఉంటే సరిపోదు..
సినిమా రంగంలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలంటే అందం ఒక్కటే సరిపోదు. నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలి. ఇదే ఆలోచనతో ముందుకు సాగుతోంది రితికా నాయక్. తనకు అందమైన రూపం ఉందని మాత్రమే కాకుండా.. ‘బాగా నటిస్తుంది’ అని ప్రేక్షకులు అనుకోవాలన్నదే తన లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఉందని, ఒక్క తరహా పాత్రలకే పరిమితం కావడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది.

అల్లు అర్జున్ అంటే క్రష్..
మీ క్రష్ ఎవరని రితికాను ఓ సందర్భంలో అడగ్గా.. తనకు అల్లు అర్జున్‌పై క్రష్ ఉందని రితికా నాయక్ చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో జీవిత భాగస్వామి విషయంలోనూ ఆమెకు కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయని తెలిపింది. తనను ఎంతో ప్రేమించే వ్యక్తి కావాలని, బంధంలో నమ్మకానికి ప్రాధాన్యమివ్వాలని తెలిపింది. అంతేకాదు.. తన వృత్తిని అర్థం చేసుకుంటూ, కెరీర్‌లో ముందుకు సాగేందుకు ప్రోత్సహించే వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. కాగా ఇటీవల కొరియన్ కనకరాజుతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రితికా.. వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తో కలిసి ‘డ్యూయెట్’ అనే సినిమాలో నటిస్తోంది.
(ఇదీ చదవండి: వెన్నుపోటు పొడిచిన త్రిగుణ్.. ‘నేను చూసింది నిజమేనా’: వర్షిణి)


