
నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రెట్రో.. నటి పూజా హెగ్డే ఇందులో నాయకిగా నటించారు. ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. అయితే, సూర్య, కార్తీక్ సుబ్బరాజుకు చెందిన సొంత నిర్మాణ సంస్థలే రెట్రోను తెరకెక్కించాయి. మే 1న విడుదలైన ఈ మూవీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌తో ఉంది. అయితే, ఈ మూవీని శక్తి ఫిలిమ్ ఫ్యాక్టరీ సంస్థ అధినేత శక్తి వేలన్ తమిళనాడులో డిస్ట్రిబ్యూషన్ చేశారు. కాగా రెట్రో చిత్రం విజయాన్ని పురస్కరించుకొని ఆయన ఆనందంగా ఆ చిత్ర యూనిట్‌కు విలువైన బహుమతులను అందించారు.
చెన్నైలో జరిగిన ఈ వేడుకలో చిత్ర కథానాయకుడు సూర్యకు కానుకగా వజ్రపుటుంగరాన్ని శక్తి వేలన్ అందించారు. అదేవిధంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు, చాయాగ్రహకుడు, సంగీత దర్శకుడు ఇతర చిత్ర యూనిట్ సభ్యులందరకి వజ్రపుటుంగరాలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ సూర్య కథానాయకుడిగా నటించిన రెట్రో చిత్రం రూ.100 కోట్ల వసూళ్లను దాటి పరుగులు తీస్తోందన్నారు. ఈ ఏడాది విడుదల చిత్రాలలోనే అధిక లాభాలు తెచ్చి పెట్టిన చిత్రం ఇదేనన్నారు.
ఉచిత డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశాన్ని తనకు కల్పించిన నటుడు సూర్య ,రాజశేఖర పాండియన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాను ఇంతకుముందు సూర్య నిర్మించిన కడైకుట్టి సింగం(చినబాబు ) చిత్ర సక్సెస్ వేడుక సందర్భంగా బంగారు గొలుసును, అదేవిధంగా విరుమాన్ చిత్ర విజయం సాధించిన సందర్భంగా బంగారు బ్రేస్లెట్‌ను సూర్యకు కానుకగా అందించగా ఆయన వాటిని మళ్లీ తనకే తిరిగి ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వజ్రపుటుంగరాన్ని తనకే ఇచ్చారని చెప్పారు.