టాలీవుడ్ స్థాయిని ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన కల్ట్ మూవీ శివ. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ మూవీ మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వస్తోంది. ఆర్జీవీ- నాగార్జున కాంబోలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 14న థియేటర్లలో సైకిల్ చైన్ సీన్‌తో కింగ్ నాగార్జున మరోసారి అలరించనున్నారు.
ఈ మూవీ రీ రిలీజ్‌కు ముందు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో శివ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ సినిమా నుంచే ప్రేరణ పొంది ఈ కల్ట్ క్లాసిక్ మూవీని తెరకెక్కించానని తెలిపారు. శివ తీయడానికి ముఖ్య కారణం బ్రూస్‌లీ నటింంచిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగనే కారణమని ఆర్జీవీ వెల్లడించారు.
తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు బ్రూస్ లీకి పెద్ద అభిమానిని. నాగార్జున కోసం స్క్రిప్ట్ రాయమని వెంకట్ అడగడానికి ఒక రోజు ముందు.. బ్రూస్‌లీ మూవీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' 15వ సారి చూశా. నేను ఆ సినిమా నుంచి ప్రైమరీ కాన్సెప్ట్ తీసుకున్నా. రెస్టారెంట్‌ను కళాశాలగా, మార్షల్ ఆర్ట్స్‌ను మన స్టైల్లో ఫైట్‌లకు మార్చా. అలా మొదటి డ్రాఫ్ట్‌ను 20 నిమిషాల్లోనే రాశా. చాలా పాత్రలను నా కళాశాల అనుభవాలతో క్రియేట్ చేశా" అని అన్నారు.
మొదట నాగార్జునతో ఇంత పెద్ద స్థాయిలో సినిమా చేయాలని ఎప్పుడూ అనుకోలేదని చిత్ర నిర్మాత నాతో చెప్పారని ఆర్జీవీ తెలిపారు. నేను రాత్రి కూడా స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతున్నా.. చిన్న చిన్న హర్రర్ సినిమాలు తీయాలనుకునేవాన్ని.. కానీ నాగార్జున నా స్క్రిప్ట్ అంగీకరిస్తారని కూడా ఎప్పుడూ అనుకోలేదని ఆర్‌జీవీ అన్నారు. కాగా.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున అక్కినేని, అమల, రఘువరన్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు. 1989లో విడుదలైన శివ మూవీకి ఇళయరాజా సంగీతమందించారు.


