
సెలబ్రిటీల సంపాదనకు తగ్గట్లే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఏదైనా ఈవెంట్‌కు, అవార్డుల ఫంక్షన్‌కు వెళ్లాలంటే మేకప్, హెయిర్ స్టైలింగ్ చేసేవారు తప్పనిసరి. వీళ్లు సందర్భాన్ని బట్టి వేలు, లక్షల్లో తీసుకుంటారని చెప్తోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో రకుల్ మాట్లాడుతూ.. మేకప్ వేసేందుకు, డ్రెస్‌కు తగ్గట్లుగా హెయిర్ స్టైల్ చేసేందుకు ఒక టీమ్ పనిచేస్తూ ఉంటుంది.
ఆరేళ్లుగా ఒకే టీమ్‌తో పని చేస్తున్నా..
రెడ్‌కార్పెట్‌పై మేము అందంగా కనిపించేందుకు వీళ్లు సాయపడతారు. కేవలం ఒక్క లుక్ కోసం రూ.20 వేల నుంచి రూ.1 లక్ష వరకు తీసుకుంటారు. స్టైలిస్ట్‌కు, మేకప్ టీమ్‌కు, ఫోటోగ్రాఫర్‌కు.. ఇలా అందరికీ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. నేను ఆరేళ్లపాటు ఒకే మేకప్- హెయిర్ టీమ్‌తో కలిసి పని చేస్తున్నాను. వారు నాకు కుటుంబసభ్యుల్లానే అనిపిస్తారు.
పైసా ఖర్చుండదనేది నిజం కాదు!
ఈవెంట్స్ కోసం డిజైనర్స్ మాకు ఉచితంగానే దుస్తులు పంపిస్తారు. దీనివల్ల మాకు పైసా ఖర్చు ఉండదని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాళ్లు ఫ్రీగానే ఇచ్చినా దాన్ని తెచ్చినవారికి.. ఆ డ్రెస్‌కు తగ్గట్లుగా మమ్మల్ని అందంగా రెడీ చేసిన స్టైలిస్ట్‌కు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొరియర్ చార్జీలు కూడా అందులోనే జత చేస్తారు. అందుకే అంతర్జాతీయ డిజైనర్ రూపొందించిన డ్రెస్ ధరించాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
నాకైతే నచ్చదు
ఆ డ్రెస్‌కు తగ్గట్లుగా ఎలా రెడీ అవ్వాలన్నది స్టైలిస్ట్ చూసుకుంటాడు. డిజైనర్లు మాకు డ్రెస్‌లు ఇవ్వాలని తహతహలాడుతుంటారు. ఎందుకంటే మేము వాటిని ధరించినప్పుడు ఎక్కువ అటెన్షన్ వస్తుంది. డిజైనర్ క్రియేటివిటీ ఎక్కువమందికి తెలుస్తుంది. వారి అమ్మకాలు కూడా పెరుగుతాయి. అయితే చాలామటుకు నేను ఉచితంగా దుస్తులు తీసుకోవడానికి ఇష్టపడను అని రకుల్ చెప్పుకొచ్చింది.
చదవండి: ఇక ఆపండి.. మీ తల్లి, చెల్లి, భార్య వీడియోలు చూడండి: నటి ఫైర్