‘‘తెలుగు పరిశ్రమలో పన్నెండేళ్ల ప్రయాణం నాది. వైజాగ్‌లో చిన్న కెమెరాలతో షార్ట్ ఫిలింస్ చేసుకునే పరిస్థితి నుంచి 20 ఫీచర్ ఫిలింస్ చేశాను. ఇంతకంటే ఏం కావాలి. ఇన్నేళ్ల నా ప్రయాణం పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను’’ అని హీరో రాజ్ తరుణ్ తెలిపారు. రామ్ కడుముల దర్శకత్వంలో రాజ్ తరుణ్, రాశీ సింగ్ జోడీగా నటించిన చిత్రం ‘పాంచ్ మినార్’. గోవింద రాజు సమర్పణలో మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ మాట్లాడుతూ– ‘‘పక్కా క్రైమ్ కామెడీ చిత్రం ‘పాంచ్ మినార్’.
ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకునే ఓ కుర్రాడు ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు? అనేది కథ. ఈ మూవీలో నా పాత్ర ఎంతలా నలిగిపోతుంటే ప్రేక్షకులకు అంత నవ్వొస్తుంది. మా సినిమా క్రైమ్ కామెడీ అయినప్పటికీ వయొలెంట్ ఫిల్మ్ కాదు... కుటుంబమంతా కలిసి నవ్వుకుంటూ చూడొచ్చు. రామ్ కడుములగారు స్క్రీన్‌ప్లేని అద్భుతంగా రాశారు. మాధవిగారు ఫ్యాషనేట్‌ప్రొడ్యూసర్. గోవింద్‌గారు షూటింగ్‌కి సంబంధించిన ప్రతి విషయంలో కేర్ తీసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్రతో ఇది నాకు నాలుగో సినిమా.
‘పాంచ్ మినార్’లో తన నేపథ్య సంగీతం ఆకర్షణగా నిలుస్తుంది. నేను నటించిన కొన్ని సినిమాలు అనుకున్నంతగా ప్రేక్షకులకు చేరువ కాలేదు. అందుకు కారణాలు ఉండొచ్చు. ప్రస్తుతం తెలుగు–తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే తెలుగులో ఓ మూవీ షూట్ పూర్తి కావొచ్చింది. సోమవారంప్రారంభమైన నా మరో మూవీ మంచి థ్రిల్లర్’’ అని చెప్పారు.


