ప్రముఖ నటుడు రాఘవా లారెన్స్ ఎట్టకేలకు ఊహాగానాలపై స్పందించారు. గత కొంతకాలంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారని.. ఫలానా పార్టీలో చేరి ఉపఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఇంకొంత కాలం సస్పెన్స్‌ను కొనసాగించాలనే ఆయన నిర్ణయించారు.
రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేదానిని లారెన్స్ ప్రశ్నార్థకంగా వదిలేశారు. ఈ అంశాన్ని ప్రజలే నిర్ణయించాలంటూ ఎక్స్ ఖాతాలో తాజాగా ఆయనో వీడియో రిలీజ్ చేశారు. కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ నటుడైన లారెన్స్.. అటు సమాజ సేవతోనూ మంచి గుర్తింపు పొందారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై కుతూహలం నెలకొంది.
ఈ ప్రచారం స్వయంగా ఆయనే స్పందించారు. తాను ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని.. పదవి కోసమో లేదంటే డబ్బు కోసం రాజకీయాలను ఆశ్రయించడం లేదని రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు. అయితే తనకు నమ్మకమైన, సన్నిహిత వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే.. అతనికి అండగా నిలిచి, వ్యక్తిగతంగా చేస్తున్న సమాజ సేవను మరింత పెద్ద స్థాయిలో చేయాలనే ఆలోచన మాత్రమే తనకు ఉందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు తనను రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన స్థితికి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. రాజకీయాలపై తానే ఓ కీలక ప్రకటన చేస్తానని లారెన్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. అయితే దర్శక దిగ్గజం భారతీరాజా మృతితో ఆ ప్రకటనను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ తరుణంలో ఓ వీడియో రిలీజ్ చేశారిప్పుడు.
ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి వస్తానని, లేకుంటే లేదని తేల్చేశారు. ప్రజాశీర్వాదంతోనే.. తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఆయన కామెంట్ సెక్షన్‌లో పలువురు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఆయన ట్వీట్ సారాంశం..
Do your duty sincerely, without expecting anything in return.
After watching this video, please share your advice and guidance in the comments. If you say “No,” I will not enter politics and will continue my selfless service to society. But if you say “Yes,” I am ready to enter… pic.twitter.com/VwPFjdaUqy— Raghava Lawrence (@offl_Lawrence) June 12, 2026
ఫలితాలపై ఆశలు పెట్టుకోకుండా మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. మీరు 'వద్దు' అంటే నేను రాజకీయాల్లోకి రాను.. సమాజ సేవనే కొనసాగిస్తాను. 'అవును' అంటే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు, ఎవరితో కలిసి నా రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతుందో త్వరలో వెల్లడిస్తాను.
అయితే.. లారెన్స్ కేవలం నటుడిగానే కాదు, కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాతగానూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. చిన్న డ్యాన్సర్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. నటుడిగా, తర్వాత స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. అనంతరం హీరోగా మారి ముని, కాంచన, కాంచన-2, కాంచన-3 వంటి హారర్-కామెడీ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా కాంచన సిరీస్‌తో దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తన తల్లి పేరిట దివ్యాంగులు, అనాథలు, పేద విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రంపై తమిళనాడులో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే..
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు లారెన్స్‌కు మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో విజయ్ నటించిన పలు చిత్రాలకు లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే లారెన్స్ సేవా కార్యక్రమాలకు విజయ్ ఆర్థిక సాయం అందించారు. దీంతో లారెన్స్ టీవీకే పార్టీలో చేరతారని, విజయ్ రాజీనామాతో(రెండింటిలో ఒకటి రాజీనామా చేయాల్సిన పరిస్థితిలో) ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీవీకే పార్టీ ఇప్పటిదాకా ఓ స్పష్టమైన ప్రకటన చేయలేదు.


