
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కన్నడకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ షూటింగ్ ఆపేయాలని కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) నోటీసు జారీ చేసింది. బెంగళూరు శివార్లలోని బిడడి హోబ్లిలోని జాలీవుడ్ స్టూడియోస్ & అడ్వెంచర్స్‌లో బిగ్‌బాస్ సెట్ ఉన్న విషయం తెలిసిందే.
కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతున్న ప్రకారం.. బిగ్‌బాస్ హౌస్ నుంచి శుద్ధి చేయని మురుగునీటిని సైట్ వెలుపల విడుదల చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. బిగ్‌బాస్ సెట్ దగ్గరలో 250 KLD-సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) ఏర్పాటు చేసినట్లు నిర్మాణ బృందం పేర్కొన్నప్పటికీ, ఆ సదుపాయంలో సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని.. STP యూనిట్ల నిర్మాణం సరిగా లేదని అధికారులు గుర్తించారు.

అధికారుల తనిఖీలో చెత్త నిర్వహణ పద్ధతులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని తేలింది. ప్లాస్టిక్ కప్పులు, పేపర్ ప్లేట్లు, ఇతర డిస్పోజబుల్స్ వంటి వ్యర్థాలు అన్నీ బహిరంగంగానే వేశారని చెబుతున్నారు. అదనంగా, 625 kVA, 500 kVA సామర్థ్యం గల రెండు డీజిల్ జనరేటర్ సెట్‌లు అక్కడ ఏర్పాటు చేశారని తేలింది. ఇది మరింత పర్యావరణ ఆందోళనలను రేకెత్తిస్తోందని చెప్పారు. దీంతో వెంటనే బిగ్‌బాస్ షోను ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డు ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖను సూచించింది.
బిగ్ బాస్ కన్నడ సెప్టెంబర్ 28న ప్రారంభమైంది. కిచ్చా సుదీప్ హోస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడంతో సోషల్‌మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.