మహేశ్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘పోకిరి’. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. టాలీవుడ్‌లో ఫస్ట్ రూ. 50 కోట్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ.. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టింది. 200లకు పైగా కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి, ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా.. 15 కేంద్రాల్లో 200 రోజుల పాటు ప్రదర్శించబడిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. 75ఏళ్ళ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డుగా పోకిరి నిలిచింది.
హీరోగా ఫస్ట్ ఛాయిస్ మహేశ్ బాబు కాదు
పోకిరి సినిమా కథ రాసుకున్నప్పుడు తొలుత మహేశ్‌ని అనుకోలేదట పూరి. మాస్ మహారాజ రవితేజని దృష్టిలో పెట్టుకొని ఈ కథను రెడీ చేశాడట. అయితే, పలు కారణాల వల్ల రవితేజతో ఈ సినిమాను పూరి చేయలేకపోవడంతో మహేశ్ ఎంట్రీ ఇచ్చేశారట. అలాగే ఈ సినిమాకు ‘పోకిరి’అనే టైటిల్‌ను కూడా చివర్లో ఫైనల్ చేశారట. మొదట్లో ఈ కథకి ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య’అని టైటిల్‌ను పూరి ఫిక్స్ చేసుకున్నాడట.. కానీ, ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకోవడం వల్ల టైటిల్‌తో పాటు కథలో కొన్ని మార్పులు చేసి పోకిరి అనే టైటిల్‌ను ప్రకటించారట.
పోకిరికి నో చెప్పిన ఇద్దరు హీరోయిన్స్
ఈ సినిమాకు హీరోయిన్‌గా ఫస్ట్ చాయిస్ ఇలియానా కాదట. ఆమెను కూడా చివరి నిమిషంలో దర్శకుడు పూరి తీసుకున్నారు. తొలుత ఈ చిత్రానికి హీరోయిన్‌గా అయేషా టాకియాను సంప్రదించారట. అన్నీ ఓకే అయ్యాక మె కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి ఒప్పులేదు. ఆ తర్వాత బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ని ఎంపిక చేస్తే.. షూటింగ్‌కి రెడీ అవుతున్న సమయంలో కంగనా కూడా హ్యాండించింది. తనకు బాలీవుడ్‌లో ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో చివరి నిమిషంలో ఇలియానాను సంప్రదిస్తే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ సినిమాతోనే ఇలియానా స్టార్ హీరోయిన్‌గా తన కెరీర్ మారిపోయింది.
మహేశ్ కటౌట్ చూస్తే మిల్కీ బాయ్‌లా ఉంటాడు.. ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో క్లాస్‌గా కనిపించే ఆయన తొలిసారి ఈ సినిమాలో ఊరమాస్ గెటప్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడు మూవీ తర్వాత సుమారు నాలుగు నెలలు గ్యాప్ తీసుకుని తన గెటప్‌ను చేంజ్ చేసుకున్నాడు. పోకిరి కోసం సరికొత్త లుక్‌లో కనిపించేందుకు చాలానే కష్టపడ్డాడు. అప్పటివరకు క్లాస్‌గా కనిపించే మహేశ్‌లోని ఊరమాస్ యాంగిల్‌ని ప్రేక్షలకు చూపించాడు పూరి. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంత షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి రికార్డులకు ఎక్కింది.


