
హీరోలతో సమానంగా తమకు ప్రాధాన్యత దక్కడం లేదని ఎంతోమంది హీరోయిన్లు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. తాజగా బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరుచ (Nushrratt Bharuccha) కూడా అదే మాట అంటోంది. హీరోలను ఒకలా.. తమను మాత్రం మరోలా ట్రీట్ చేస్తారని వాపోయింది. కొన్నిసార్లు తమకు కనీస వసతులు కూడా ఉండవని పేర్కొంది.
హీరోలతో సమానంగా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నుష్రత్ బరుచ మాట్లాడుతూ.. ఒక హీరో హిట్టు కొట్టగానే అతడికి కనీసం ఐదు సినిమా ఆఫర్లయినా వస్తాయి. కానీ, హీరోయిన్ పరిస్థితి అలా ఉండదు. ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండాలి. ప్యార్ కా పంచనామా (2011) సినిమా టైం నుంచి నేను ఇదే మాట చెప్తున్నా..! ఎవరైనా సినిమాతో సక్సెస్ అందుకున్నాక ఇంకేం కోరుకుంటారు? మరిన్ని మంచి ప్రాజెక్టులు రావాలని ఎదురుచూస్తారు. హీరోలు అలా వచ్చినవాటిలో బెస్ట్ ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తారు. మాకంత అదృష్టం లేదు. వారికి వచ్చినన్ని అవకాశాలు మాకు రావు.
వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు కూడా..
అంతెందుకు? సెట్‌లో కూడా ఏదైనా అత్యవసరమైతే హీరో వానిటీ వ్యాన్‌ను ఐదు నిమిషాలు వాడుకోవచ్చా? అని అడగాల్సిన పరిస్థితి కూడా ఫేస్ చేశాను. అది కూడా సెట్‌లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే.. వాష్‌రూమ్ కోసం ఆ వ్యాన్‌లోకి వెళ్తానని అడిగేదాన్ని. అప్పుడు హీరోకు ఉన్నన్ని వసతులు, సౌకర్యాలు నాకు అందించలేదేంటని గొడవ చేయలేదు. నేను కూడా ఆ స్థాయికి వెళ్లాలని మాత్రమే బలంగా కోరుకున్నాను అని చెప్పుకొచ్చింది. నుష్రత్ చివరగా చోరీ 2 అనే హారర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హిందీలో అనేక సినిమాలు చేసిన ఈ హీరోయిన్ తెలుగులో శివాజీ తాజ్‌మహల్ మూవీలో యాక్ట్ చేసింది.