
టైటిల్: హరిహర వీరమల్లు
నటీటులు: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, సునీల్, నాజర్, రఘు బాబు తదితరులు
నిర్మాణ సంస్థ: మెగా సూర్య ప్రొడక్షన్స్
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఏఎం రత్నం
దర్శకత్వం: క్రిష్, జ్యోతికృష్ణ
సంగీతం: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస
విడుదల తేది: జులై 24, 2025
ఎట్టకేలకు హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ..నేడు(జులై 24) థియేటర్స్‌లో రిలీజైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
ఇది 16వ శాతాబ్దంలో జరిగే కథ. హరి హర వీరమల్లు (పవన్ కల్యాణ్) ఓ గజ దొంగ. ఉన్నవాళ్ల దగ్గర దోచుకొని లేని వాళ్లకు పంచేస్తుంటాడు. మొఘల్ సైన్యం తరలించుకుపోతున్న వజ్రాల్ని దొంగలించి చిన్న దొర(సచిన్ కేడ్కర్) దృష్టిలో పడతాడు. చిన్న దొర అతన్ని పిలుపించుకొని గోల్కొండ నవాబుకు పంపాల్సిన డైమాండ్స్‌ని దొంగిలించి తనకు ఇవ్వాలని కోరతాడు. దానికి బదులుగా రెండు వజ్రాలను ఇస్తానని ఒప్పందం చేసుకుంటాడు. వీరమల్లు మాత్రం వజ్రాలతో పాటు చిన్నదొర దగ్గర బంధీగా ఉన్న పంచమి(నిధి అగర్వాల్)ని విడిపించాలనుకుంటాడు.
కానీ వీరమల్లు ప్లాన్ బెడిసి కొట్టి గొల్కొండ నవాబుకు బంధీగా దొరికిపోతాడు. వీరమల్లు నేపథ్యం తెలిసిన నవాబ్.. ఢిల్లీలోని ఎర్రకోటలో ఔరంగజేబు(బాబీ డియోల్) ఆధీనంలో ఉన్న కొహినూర్ వజ్రాన్ని వెనక్కి తెచ్చి ఇవ్వాలని కోరతాడు. వీరమల్లు తన స్నేహితులు(నాజర్, సునీల్, రఘు బాబు,సుబ్బరాజు)తో పాటు నవాబు మనుషులతో కలిసి ఢిల్లీకి పయనం అవుతాడు. వీరమల్లు ఢిల్లీ ప్రయాణం ఎలా సాగింది? ఈ జర్నీలో ఆయనకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు ఔరంగజేబు దగ్గర ఉన్న కొహినూర్ వజ్రాన్ని తీసుకురాగలిగాడా లేడా? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu Review) చిత్రంపై మొన్నటి వరకు పెద్ద అంచనాల్లేవు. ప్రచార చిత్రాలు చూసి ఫ్యాన్స్ సైతం ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై కాస్త బజ్ క్రియేట్ చేసింది. దానికి తోడు పవన్ కూడా తొలిసారి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో సినిమా బాగుందేమో అందుకే ఆయన రంగంలోకి దిగాడని ఫ్యాన్స్‌తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా భావించారు. కానీ వారి ఆశలపై వీరమల్లు నీళ్లు చల్లాడు. కథే రొటీన్ అంటే అంతకు మించిన అవుట్ డేటెడ్ స్క్రీన్‌ప్లేతో ఫ్యాన్స్‌కి సైతం ఇరిటేషన్ తెప్పించాడు.
ఇక సీజీ వర్క్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఈ మధ్య చిన్న చిన్న సినిమాలలో కూడా వీఎఫ్‌ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. మరి స్టార్ హీరో, బడా నిర్మాత ఉండి కూడా గ్రాఫిక్స్ వర్క్ ఇంత పేలవంగా ఉండడానికి కారణం ఎవరో..? తెలియదు.
గుర్రాల సీక్వెన్స్‌లతో పాటు క్లైమాక్స్‌లో వచ్చే సుడిగుండం సీన్ వరకు ప్రతీ చోట గ్రాఫిక్స్ టీం ఘోరంగా విఫలం అయింది. ఇక యాక్షన్ సీన్లు అయితే కొన్ని చోట్ల మరీ సిల్లీగా అనిపిస్తాయి.

కథ కథనం విషయానికొస్తే.. అసలీ కథే గందరగోళంగా ఉంటుంది. ప్రేక్షకుడు ఏ ఎమోషన్‌కి కనెక్ట్ కావాలో అర్థం కాక.. అలా కుర్చీలో కూర్చిండిపోతాడు. హిందువులపై మొగల్ సైన్యం చేసిన అరచకాలకు సంబంధించిన సన్నివేశాలు ఇటీవల వచ్చిన ఛావా చిత్రాన్ని గుర్తు చేస్తాయి. వీరమల్లు పాత్ర ఫిక్షనల్ కాబట్టి కనీసం ఆ ఎమోషన్‌తో కూడా సరిగ్గా కనెక్ట్ కాలేం.
ఇక వీరమల్లు చేసే దొంగతనాల సీన్స్ రాబిన్ హుడ్ పాత్రతో వచ్చిన పలు సినిమాలను పోలి ఉంటాయి. హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు మొదలు వార్ సీక్వెన్స్ అన్నీ బాహుబలి చిత్రాన్ని గుర్తు చేస్తాయి. కొన్ని చోట్ల మంచి సన్నివేశాలు ఉన్నా.. పేలవమైన సీజీ వర్క్ కారణంగా అవి కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఉన్నంతలో ఫస్టాఫ్ పర్వాలేదు. దర్శకుడు క్రిష్ కొన్ని సీన్లను బాగానే డీల్ చేశాడు. సెకండాఫ్ వచ్చే సరికే కథ ఎటో వెళ్లిపోయింది. పవన్ కోసమే అన్నట్లు కొన్ని సన్నివేశాలను బలవంతంగా ఇరికించడం.. ఆ ఇరికించిన సీన్లలో ఎమోషన్ సరిగా పండకపోవడంతో ద్వితియార్థం మొత్తంగా బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ ముందు వచ్చే సుడిగుండం సీన్ అయితే ప్రేక్షకుడి సనహానికి పరీక్ష పెడుతుంది. అసలు క్లైమాక్స్ సన్నివేశాన్ని అంతలా ఎందుకు సాగదీశారో అర్థం కాక.. హీటెక్కిన బుర్రతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు.

ఎవరెలా చేశారంటే..
పవన్ కల్యాణ్ పాత్ర కొత్తగా ఉంది కానీ నటన పరంగా చేయడానికేమి లేదు. ఆయనకు ఎలివేషన్ ఇవ్వడమే తప్ప.. నటనతో మెప్పించాడానికి ఏమీ లేదు. కొన్ని యాక్షన్స్ సీన్స్ పరవాలేదు. చాలా వరకు డూప్‌తోనే కవర్ చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. నిధి అగర్వాల్ పాత్ర నిడివి తక్కువే అయినా... ఉన్నంతలో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఒకటి ఫస్టాఫ్‌కే హైలెట్ అని చెప్పొచ్చు. అయితే షూటింగ్ ఐదేళ్లుగా సాగింది కాబట్టి కొన్ని చోట్ల బొద్దుగా కనిపించింది.
ఔరంగజేబుగా బాబీ డియోల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. చిన్న దొరగా సచిన్ ఖేడేకర్, పెద్ద దొర పాత్రలో కోట శ్రీనివాసరావు ఒకటి రెండు సీన్లలో కనిపించినా.. బాగానే నటించారు. రఘుబాబు, సునీల్, సుబ్బరాజ్, సత్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. కీరవాణి సంగీతమే ఈ సినిమాకు కాస్త ప్లస్ అయిందని చెప్పాలి. అయితే అదే బీజీఎం కొన్ని చోట్ల చిరాకుగానూ అనిపిస్తుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ ఫస్టాఫ్ వరకు పర్వాలేదు. సెకండాఫ్‌కి వచ్చేసరికి ఘోరంగా విఫలం అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
(గమనిక : ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)