
ప్రగతి శెట్టి, రిషబ్ శెట్టి, ఎన్టీఆర్, చలువె గౌడ, రుక్మిణీ వసంత్
‘‘నన్ను ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకుని వెళ్లాలని ఎప్పట్నుంచో మా అమ్మగారి ఆకాంక్ష. రిషబ్ సార్ లేకపోయి ఉంటే ఆ దర్శన భాగ్యం కలిగి ఉండేది కాదు. థ్యాంక్స్ చెప్పి, మా మధ్య దూరాన్ని పెంచలేను. మా అమ్మగారి ఆకాంక్షను నెరవేర్చినందుకు ఐ లవ్ యూ సార్. ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా కోసం రిషబ్ ఎంత కష్టపడ్డారో చూశాను. ఈ సినిమా చేయడం అంత సులభం కాదు. రిషబ్ అరుదైన దర్శక–నటుడు. ఆయనలోని డైరెక్టర్ అతన్ని డామినేట్ చేస్తాడా? లేక యాక్టర్ డామినేట్ చేస్తాడా? అనే ఆలోచన నాకు ఉండేది. కానీ సినిమాలోని 24 క్రాఫ్ట్స్‌ని రిషబ్ డామినేట్ చేస్తారు’’ అని ఎన్టీఆర్ అన్నారు.
రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం తెరకెక్కింది. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ అక్టోబరు 2న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘మాములుగా ప్రతిసారీ అరిచినట్లుగా ఈసారి మాట్లాడలేను.
కొంచెం నొప్పిగా (ఈ మధ్య స్వల్ప గాయం అయింది) ఉంది. నాకు తెలిసి నా వయసు మూడేళ్లో, నాలుగేళ్లో అయ్యింటుంది. అప్పుడు మా అమ్మమ్మ నన్ను కూర్చోబెట్టి, కుందాపూర్ దగ్గరే మా ఊరు... అంటూ చిన్నప్పుడు ఆమె విన్న కొన్ని కథలు చెప్పింది. ఈ కథ నిజమేనా? ఇది జరిగి ఉంటుందా? అని అర్థమయ్యేది కాదు. కానీ ఆ కథలు ఆసక్తిగా ఉండేవి. ఒక్కసారైనా ఈ గుళిగ ఆట అనేది ఏంటి? ఈ బింజురుళి అంటే ఏమిటో చూడాలని నా చిన్నప్పుడే నాటుకుపోయింది. కానీ ఏ రోజూ అనుకోలేదు. నేను విన్న ఆ కథల నుంచి, నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఒక సినిమా తీస్తాడని. ఆ దర్శకుడు ఎవరో కాదు... నా సోదరుడు రిషబ్ శెట్టి. నేను విన్న కథలను సిల్వర్ స్క్రీన్‌పై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు.
కథ తెలిసి నేనే ఇలా అయిపోతే ఈ కథ కొత్తగా తెలిసినవాళ్లు ఏమయ్యారో అదే ‘కాంతార 1’ సినిమా రిజల్ట్. ఈ ‘కాంతార: చాప్టర్ 1’ గొప్ప బ్లాక్‌బస్టర్ చిత్రంగా భారతీయ సినిమా చరిత్రలో ప్రస్ఫుటంగా కనపడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈ సినిమాను అక్టోబరు 2న థియేటర్స్‌లో చూడండి. రిషబ్ కష్టాన్ని ఆశీర్వదించి, ‘కాంతార: చాప్టర్ 1’ను విజయం బాటవైపు నడిపిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. ‘‘ఎన్టీఆర్‌గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక బ్రదర్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాను మీరందరూ థియేటర్స్‌లో చూసి, ఆశీర్వదించి, పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు రిషబ్ శెట్టి.
హోంబలే ఫిలింస్ సహ వ్యవస్థాపకుడు చలువే గౌడ మాట్లాడుతూ– ‘‘‘కాంతార: చాప్టర్ 1’ మన సంస్కృతి, నమ్మకాలు, కథలు, మూలాలకు నివాళి’’ అని చె΄్పారు. ‘‘ఈ సినిమా చూసిన ఓ నలుగురు పెద్దవాళ్లు ‘ఈ సినిమా స్పెల్‌బౌండ్’ అని చె΄్పారు. ‘కాంతార: చాప్టర్ 1’ పెద్ద చిత్రం అవుతుంది. ఇక వచ్చే నెల ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది’’ అని మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ పేర్కొన్నారు. ‘‘కాంతార’ సినిమాల కోసం రిషబ్ ఐదేళ్ళుగా కష్టపడుతున్నారు’’ అని కాస్ట్యూమ్ డిజైనర్, రిషబ్ భార్య ప్రగతి అన్నారు. ‘‘కాంతార: చాప్టర్1’ తెలుగు వెర్షన్‌లోనూ రెండు పాటలు రాశాను’’ అని చెప్పారు రాంబాబు గోసాల. మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి, ప్రోడక్షన్ డిజైనర్ బంగ్లన్ తదితరులు పాల్గొన్నారు.